క్వార్టర్స్‌లో సింధు

Indus in quarters– గ్రెగోరియపై మెరుపు విజయం
– డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ 750
ఒడెన్సె (డెన్మార్క్‌) : భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణి పి.వి సింధు ఎట్టకేలకు గాడిలో పడినట్టు కనిపిస్తుంది. డెన్మార్క్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్న తెలుగు తేజం.. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆకట్టుకునే విజయం సాధించింది. ఏడో సీడ్‌, ఇండోనేషియా షట్లర్‌ గ్రెగోరియ మరిస్కతో మూడు గేముల మారథాన్‌ మ్యాచ్‌లో సింధు గెలుపొందింది. తొలి గేమ్‌లో నిరాశపరిచిన సింధు.. వరుసగా చివరి రెండు గేముల్లో విజయాలు సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. 71 నిమిషాల మ్యాచ్‌లో సింధు 18-21, 21-15, 21-13తో విజయం సాధించింది. తొలి గేమ్‌లో 4-4 తర్వాత వెనుకంజ వేసిన సింధు మళ్లీ పుంజుకోలేదు. కానీ రెండో గేమ్‌లో ఆది నుంచి ముందంజలో నిలిచింది. 14-14తో ఇండోనేషియా అమ్మాయి సమవుజ్జీగా నిలిచినా సింధు వెనక్కి తగ్గలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైతం గ్రెగోరియ గట్టి పోటీ ఇచ్చింది.
ప్రథమార్థంలో ఉత్కంఠగా సాగిన పోరును ద్వితీయార్థంలో ఏకపక్షం చేసింది సింధు. ఇక నేడు జరిగే క్వార్టర్‌ఫైనల్లో థారులాండ్‌ షట్లర్‌ సుపనిదతో సింధు తలపడనుంది. మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్‌ ఆకర్షి కశ్యప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 18-21, 8-21తో సుపనిదతో రెండో రౌండ్లో వరుస గేముల్లో పరాజయం పాలైంది.

Spread the love