Saturday, August 15, 2026
E-PAPER
Homeజిల్లాలుపరకాల అభివృద్ధికి రూ.400 కోట్లకు పైగా పనులు

పరకాల అభివృద్ధికి రూ.400 కోట్లకు పైగా పనులు

- Advertisement -

 16న పరకాలకు సీఎం రేవంత్‌రెడ్డి.. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నవతెలంగాణ–పరకాల

పరకాల నియోజకవర్గంలో రూ.400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం పరకాలలోని అంగడి స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని హెలిప్యాడ్‌ను మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు తదితరులతో కలిసి పరిశీలించారు.

సభా వేదిక, పార్కింగ్‌, ట్రాఫిక్‌, భద్రత, తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16న మధ్యాహ్నం 4 గంటలకు ముఖ్యమంత్రి పరకాల నియోజకవర్గానికి రానున్నారని తెలిపారు. సీఎం పర్యటనతో పరకాల అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని అన్నారు. నియోజకవర్గంలో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, చేపట్టనున్న కొత్త పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమై పనులను ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను పూర్తి చేస్తోందన్నారు.

వంద పడకల ఆస్పత్రి పూర్తి
గతంలో శంకుస్థాపన చేసిన పరకాల వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చి పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కృషి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో ఆస్పత్రి నిర్మాణం పూర్తయిందన్నారు. ఆస్పత్రి అందుబాటులోకి రావడంతో పరకాల, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందనుందని పేర్కొన్నారు.

పేదల సొంతింటి కలకు భరోసా
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పరకాల నియోజకవర్గానికి రెండు విడతల్లో సుమారు 6 వేల ఇళ్లు మంజూరయ్యాయని పొంగులేటి తెలిపారు. మొదటి విడతలో 3,500, రెండో విడతలో 2,500 ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున సుమారు రూ.300 కోట్ల ఆర్థిక సహాయం అందనుందని చెప్పారు. అర్హులైన మరిన్ని కుటుంబాలకు భవిష్యత్‌లో ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోయినా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత రెండున్నరేళ్లుగా పేదల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల మాదిరిగా సమన్వయం చేసుకుంటూ తెలంగాణ ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

80 వేల మంది తరలివచ్చే అవకాశం
ముఖ్యమంత్రి సభకు పరకాల నియోజకవర్గం నుంచి సుమారు 75 వేల నుంచి 80 వేల మంది ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పార్కింగ్‌, ట్రాఫిక్‌, భద్రత, అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, అధికారులు గత నాలుగు రోజులుగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నామని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత, పరకాల మున్సిపల్‌ చైర్మన్‌ సునీల్‌కుమార్‌, పరకాల ఆర్డీవో డీఎస్‌ వెంకన్న, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ పవన్‌, ట్రైనీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోహిత్‌నేత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -