నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్-1మైన్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంపదల సంరక్షణ, పచ్చదనం పెంపొందింపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ మేనేజర్ కే.ఎస్.ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ జి.శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కే.సురేష్ బాబు, ఎస్టేట్ ఆఫీసర్ రామచంద్ర మూర్తి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ రామ్ కుమార్, హెచ్ ఆర్ డి.జి.యమ్ రమేష్ బాబు హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, కాలుష్యం, అటవీ వినాశనం వంటి సమస్యలు మానవాళికి సవాలుగా మారుతున్న నేపథ్యంలో, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లుగా తెలిపారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సందర్భంగా ఉద్యోగులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, “ఒక్కొక్కరు ఒక్క మొక్క నాటితే, భూమికి గొప్ప సేవ చేసినట్లే” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎమ్మార్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.



