జులై 4న రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు!

– రిటర్నింగ్‌ అధికారిగా జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)లో ఓ వైపు మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపుల కేసులో పురోగతి సాధించకుండానే.. జాతీయ మల్లయుద్ధ సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఎన్నికల నిర్వహణ, ఆ క్రీడా సంఘం రోజు వారీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)కు అప్పగిస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ పర్యవేక్షణకు ఇప్పటికే అడ్‌హాక్‌ కమిటీని నియమించిన ఐఓఏ.. తాజాగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని సైతం నియమించింది. జమ్ము కాశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను నియమిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత ఒలింపిక్‌ సంఘం టైమ్‌లైన్‌ ప్రకారం జులై 4న భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు జరుగనున్నాయి.
‘భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఒలింపిక్‌ సంఘం చర్యలు తీసుకుంటుంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మిమ్మల్ని (జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌) నియమిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో మీకు సహాయం అందించేందుకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ సహా ఇతర సిబ్బందిని మీరు నియమించుకోవచ్చు. ప్రత్యేక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి జులై 4న ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు షెడ్యూల్‌ రూపొందించాం. భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా మీ నియామకాన్ని ఆమోదిస్తారని, ఎన్నికలను సజావుగా నిర్వహిస్తారని ఆశిస్తున్నామని’ ఐఓఓ సీఈవో కళ్యాణ్‌ చౌబె జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికల నిర్వహణకు జులై 4ను ఎంచుకున్నప్పటికీ.. జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ ఆ తేదిని మార్చేందుకు అధికారం కలిగి ఉంటారు. జులై 4 లేదా ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేది రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రత్యేక సర్వ సభ్య సమావేశం (ఎస్‌జిఎం) ఏర్పాటు చేసేందుకు కనీసం 21 రోజుల ముందుగా నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది.
బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితులకు నో !
భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్‌సభ సభ్యుడు, రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మైనర్‌ సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలం, సాక్షుల వాంగ్మూలం, క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసిన ఢిల్లీ పోలీసులు జూన్‌ 15న బ్రిజ్‌భూషణ్‌ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో సమావేశమైన రెజ్లింగ్‌ క్రీడాకారులకు జూన్‌ 30 వరకు రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు, అనుచరులు పోటీ చేయరని రెజ్లర్లకు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కుమారుడు కరణ్‌ సింగ్‌ గత రెజ్లింగ్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంఘంలో ఆఫీస్‌ బేరర్‌. బ్రిజ్‌భూషణ్‌ అల్లుడు విశాల్‌ సింగ్‌ బిహార్‌ రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు. నిబంధనల ప్రకారం కరణ్‌ సింగ్‌, విశాల్‌ సింగ్‌లు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు.
భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు 25 అనుబంధ రాష్ట్ర సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘం ఇద్దరు ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు పంపవచ్చు. రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికల్లో ఓవరాల్‌గా 50 మంది ఓటర్లు ఉంటారు. క్రీడాశాఖ మంత్రి హామీ ఇచ్చినా.. బ్రిజ్‌భూషణ్‌ కుటుంబ సభ్యులు రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్‌ దాఖలు చేస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

Spread the love