దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. అందరూ ఏకమై సాధించుకున్న రాష్ట్రం మనది. అందులో మహిళల పాత్ర గణనీయమైనది. ఎన్నో పోరాటాల ఫలితంగా స్వరాష్ట్రం ఏర్పడింది. తమకు న్యాయం జరుగుతుందని, పాలనలో ప్రాధాన్యం పెరుగుతుందని కోటి ఆశలతో మహిళలు ఎదురు చూశారు. మరి ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఆ ఆశలు నెరవేరాయా..? దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం జరుపు కుంటున్నాము. ఈ సందర్భంగా కొందరు మహిళా నేతలు ఏం కోరుకుంటున్నారో చూద్దాం…
విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ వంటివి పెట్టారు. అయితే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. మా ఊరు – మా బడి అన్నారు. అది ఆచరణలో సరిగా లేదు. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పని చేయడం లేదు. దాంతో మహిళలు పని లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళ లకు జీవనోపాధి కల్పించాలి. మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయాలి. గృహలక్ష్మి అని పెట్టి ఇండ్లు కట్టుకోవడా నికి మూడు లక్షలు ఇస్తు న్నారు. అది ఐదు లక్షలకు పెంచాలి. అలాగే మహిళా పోలీస్ స్టేషన్‌లు ఆర్‌డీఓ స్థాయిలో ఏర్పాటు చేయాలి. పెట్రోలింగ్ పెంచాలి. మహిళా పోలీసుల సంఖ్య పెంచాలి. అలాగే రేషన్ షాపుల ద్వారా కేరళలో మాదిరిగా 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలి. ముఖ్యంగా మహిళలపై సామాజిక వివక్ష, అణచివేత పెరిగిపోతున్నాయి. అందుకే సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలి. పాఠ్య పుస్తకాల్లో స్ఫూర్తిదాయకమైన మహిళల జీవితాలు ప్రవేశ పెట్టాలి. అప్పుడే మహిళల పట్ల గౌరవం పిల్లలకు చిన్నతనం నుండే వచ్చే అవకాశం ఉంటుంది.
– మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి
సామాజిక భద్రత కల్పించాలి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దాని ద్వారా వచ్చే ఆదాయ లెక్కలు చూస్తే ఎవరికైనా అర్థ మవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 6వేల కోట్లు వచ్చేది. పదమూడు జిల్లాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా 30వేల కోట్లకు చేరుకుందంటే మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిపోతుంది. అందరికీ మద్యం అలవాటు చేసి ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఉపయోగం ఏముంది. తాగి తాగి భర్తలు చనిపోతే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తామంటున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఏడాది మహిళలపై జరుగుతున్న హింస, దానిపై తీసుకోవల్సిన చర్యలపై సమీక్షా సమావేశం పెట్టేవాళ్ళు. వాటికి మహిళా సంఘాలను పిలిచి అభిప్రాయాలు తీసుకునేవాళ్ళు. కానీ ఈ పదేండ్లల్లో ఒక్కసారి కూడా ఇలాంటి సమీక్షా సమావేశం లేదు. పైగా రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లకు మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఆరు సార్లు కలిసి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయమని అడిగాం. అయినా ఎలాంటి స్పందనా లేదు. అంటే వీరి ఎజెండాలో మహిళా రక్షణ, సంక్షేమం అనేది లేదు. మహిళలపై జరుగుతున్న హింస తగ్గాలంటే సమీక్షలు చేయాలి. అధ్యయనం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మహిళలకు రక్షణ. అలాగే ఉపాధి, వైద్యం, విద్య, రక్షణ కోసం మహిళలకు ప్రత్యేక పథకాలు కల్పించాలి. సామాజిక భద్రత కల్పించేందుకు అవసరమన చర్యలు తీసుకోవాలి.
– సంథ్య, పీఓడబ్ల్యూ
పాలనలో భాగస్వామ్యం చేయాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదవ ఏడాదిలోకి అడుగు పెడుతున్నది. అయినా మహిళల పురోగతి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం శోచనీయం. మహిళలు అనేక ఆకాంక్షలతో తెలంగాణ పోరాటంలో వీరోచితంగా పాల్గొన్నారు. అరెస్టులై జైలుకు వెళ్ళారు. లాఠీ దెబ్బలు సైతం భరించారు. తెలంగాణ వస్తే మహిళలపై జరిగే దాడులు ఆగిపోతాయని, పాలనలో, అభివృద్ధిలో భాగస్వాములను చేస్తారని ఎన్నో కలలు కన్నారు. కానీ అవన్నీ కేవలం కలలుగానే మిగిలిపోయాయి. పసిపిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా లైంగిక దాడులు, వేధింపులు నిత్య కృత్యమయ్యాయి. సంఘటనలు జరిగినప్పుడు మహిళా సంఘాలు ఉద్యమాలు చేస్తే తప్ప పాలకుల్లో చలనం రావడం లేదు. రక్షణ వ్యవస్థ కూడా కదలలేని పరిస్థితుల్లో కూరుకుపోయింది. గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్టు, ఒంటరి మహిళలకు పెన్షన్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కొన్ని పథకాలు వచ్చినప్పటికీ మహిళల జీవనస్థితిగతులల్లో, స్వయం పోషకంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఇది ఆచరణలోకి రాలేదు. ఇది అమ్మాయిలు విద్యావంతులు కావడానికి ఎంతో ఉపయోగం. అలాగే విద్య పూర్తయిన తర్వాత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. కళాశాలల్లో మహిళా సెల్లు ఏర్పాటు చేయాలి. బస్సులలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అందించాలి. అన్ని రకాల స్కీము వర్కర్లకు గౌరవ వేతనం స్థానంలో కనీస వేతనాలు ఇవ్వాలి. మహిళా స్వయం శక్తి పథకం రావాలి. ఒంటరి మహిళ, వితంతు మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. మొత్తంగా మహిళా స్వయం శక్తివంతురాలు కావడానికి అవసరమై నిర్ణయాలు తీసుకోవాలి. మహిళల ఆకాంక్షలు, అవసరాల్ని గుర్తించాలి. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు రాష్ట్ర శాసనసభలో రెండు శాతం కూడా లేకపోవడం విచారకరం. పాలిచ్చి లాలిచ్చి పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పించే తల్లి పాలనలో కూడా రాణించగలదు. 50 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళా శక్తిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం. అందుకు పాలకులు చిత్తశుద్ధితో మహిళలకు స్థానం కల్పించాలి. ‘ఏది తనంతట తానై నీ దరికి రాదు. శోధించి సాధించాలి’ అన్న శ్రీశ్రీ అక్షరాలను అందుకొని మహిళలోకం ప్రజాస్వామిక ప్రతిఘటన పోరాటాలలో భాగస్వాములు కావాలి.
– ఎన్.జ్యోతి, ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి
చిత్తశుద్ధితో కృషి చేయాలి
నేడు మహిళలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు, యువతులకు రక్షణ కరువైంది. ఇటీవల కొంతమంది యువతుల్ని కర్కశంగా హత్య చేసి ముక్కలుగా నరకటం, బ్యాగ్‌లో పెట్టి తీసుకెళ్లి డ్రైనేజ్‌లో పడేయటం లాటి సంఘటనలు ఒళ్ళు గగుర్పొడుస్తున్నాయి. ఈ కిరాతక హత్యలను చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు. కానీ మనుషులు ఇంత దుర్మార్గంగా ఎందుకు తయారయ్యారు? వీరి ఆలోచనలకు పునాది ఏంటి అని ఎవ్వరూ మనసు పెట్టి ఆలోచించట్లేదు. అదేవిధంగా ఎంతో మంది దళిత, ఆదివాసీ బాలికలు ప్రేమ పేరుతో మోసానికి గురవుతున్న సంఘటనలు మా సంస్థ ‘దళిత స్త్రీ శక్తి’ ద్వారా చూశాం. ఇటీవల జరిగిన హత్యల్లో, బాలికల్ని మోసం చేస్తున్న సంఘటనల్లో మొబైల్ ఛాటింగ్, ఇన్‌స్టాగ్రామ్ ఛాటింగ్ లాంటి ఆధునిక వ్యసనాల పాత్ర బాగా వుంది. గతంతో పోలిస్తే స్త్రీలు అన్ని రంగాలలోను చైతన్య వంతమై ఆర్ధికంగా కూడా ఎదుగుతున్నారు. కానీ దాంతో పాటు ఆధునికత తెచ్చిన కొత్త టెక్నాలజీ దుర్వినియోగం కూడా పెరిగింది. దీనితో నేటి తరంలో సామాజిక స్పృహ పూర్తిగా కొరవడింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో మహిళా హక్కులకై ఉద్యమించి బీజింగ్ కాన్ఫరెన్స్ నుంచి రకరకాల హక్కులను సాధించిన మహిళా చైతన్యం నేడు కొరవడింది. దీనితో పురుషాధిక్య ఛాందస వాదం ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ పడగ విప్పింది. ఇలా అధ్వాన్నమయిన వ్యవస్థను సరిదిద్దాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వ పథకాలు, చట్టాలు అమలు తీరు నామ మాత్రంగా కాకుండా నిజాయితీగా అమలవ్వాలంటే అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి.
– ఝాన్సీ గెడ్డం, జాతీయ కన్వీనర్, దళిత స్త్రీ శక్తీ