ప్రేమ గుడ్డిదా..?

కొంతమంది వ్యక్తులను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను కాదనుకొని ఓ కొత్త వ్యక్తితో పరిచయం, ఏమీ ఆలోచించకుండా వెంటనే ప్రేమించడం. ఇదే నేడు మనం చూస్తున్న ప్రేమ. అందుకే అలా అనాల్సి వస్తుంది. ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత ఎవరు..? నమ్మించిన వ్యక్తిదా? మోసపోయిన వ్యక్తిదా? ఇలా ఎంత ఆలోచించినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టినట్టే ఉంటుంది.
అలాంటి సమస్యే నిత్యకు వచ్చింది.’మీరు చెప్పింది నిజమే మేడమ్‌. ఏమీ ఆలోచించకుండా అతను ప్రేమిస్తున్నా అన్న వెంటనే నమ్మేశాను. నాకు బాగా బుద్ధి చెప్పాడు. మా బావా చాలా మంచి వాడు.ఇప్పటికీ నన్ను పెండ్లి చేసుకుంటా అన్నాడంటే ఎంత గొప్ప మనవు..! ఇన్ని రోజులు నా వాళ్ళందరిని బాధ పెట్టాను.ఇకపై మీరు చెప్పినట్టే నడుచుకుంటాను’
నిత్యకు ఇద్దరు చెల్లెళ్లు. తండ్రి లేడు, చనిపోయాడు. తల్లే పిల్లల్ని చూసుకుంటుంది. మేనమామ ఏదైనా అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు. నిత్య తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి గురుకుల పాఠశాలలో చదువుకుంది. పదో తరగతి పూర్తి చేసిన నిత్య తల్లికి తోడుగా వుండేందుకు చిన్న ఉద్యోగం చూసుకున్నది. తాను ఎలాగో ఎక్కువగా చదువుకోలేదు. కాబట్టి తన చెల్లెళ్లను బాగా చదివించాలని, మంచి ఉద్యోగం చేస్తే చూడాలని తపించేది. ఆమె తపన చూసి తల్లి, చెల్లెళ్లు నిత్యను ఎంతో గౌరవించేవారు. ఆమె ఏం చెబితే అదే వినేవారు. ఒక విధంగా చెల్లెళ్లకు తల్లి తర్వాత తల్లిగా మారింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
ఉద్యోగం చేసే దగ్గర గోపితో పరిచయం ఆమె జీవితం మొత్తం తలకిందులు చేసింది. అతను పరిచయం అయిన నెల రోజులకే ప్రేమలో పడింది. ఆ కొద్ది రోజుల్లోనే ఆమె గోపిని పూర్తిగా నమ్మింది. కుటుంబ సభ్యులకి, స్నేహితులకి ఎవ్వరికీ చెప్పకుండా గుళ్ళో పెండ్లి చేసుకుంది. ఆ పెండ్లికి ఎలాంటి సాక్ష్యాలు ఆమె దగ్గర లేవు. ఇద్దరూ కలిసి రూమ్‌ తీసుకుని కాపురం కూడా పెట్టారు. విషయం తెలుసుకున్న తల్లి ‘ఇలా ఎందుకు చేశావు, నాకు చెబితే నేనే పెండ్లి చేసేదానిని కదా! నీవు ఇలా చేయడం సరైనది కాదు. ఇంకా ఇద్దరు చెల్లెళ్లు వారికి పెండ్లి ఎలా జరుగుతుంది?’ అంటూ బాధపడింది. అంతే కాదు ‘పెండ్లి చేసుకున్నారు కాబట్టి ఇక మాతో ఎలాంటి సంబంధం వద్దు. మీ పాటికి మీరు హాయిగా ఉండండి. మా దగ్గరకు రాకండి’ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది.
పెండ్లి తర్వాత నెల రోజులు గోపి బాగానే ఉన్నాడు. తర్వాత ఉద్యోగం మానేశాడు. తాగడం మొదలు పెట్టాడు. నిత్య జీతం మొత్తం అతనే తీసుకునే వాడు. ఊరిలో భూ తగాదా ఏదో ఉందని చెప్పి వెళ్ళి వారం పది రోజులు ఉండొచ్చే వాడు. ఇలా ఆరు నెలలు గడిచింది. కూతురిని చూడకుండా తల్లి ఉండలేకపోయింది. మళ్ళీ నిత్యతో మాట్లాడడం మొదలు పెట్టింది. కూతుర్ని ఓసారి ఇంటికి పిలిపించి ‘గోపి గురించి ఎవరికీ తెలియదు. కాబట్టి నువ్వు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళు, గోపిని మాత్రం తీసుకురాకు. నేను మామయ్య వాళ్ళతో మాట్లాడి పెద్దల సమక్షంలో మీ ఇద్దరికీ పెండ్లి చేస్తాను. అప్పటి వరకు గోపి గురించి ఎవరికీ చెప్పొద్దు’ అంది.
తల్లి చెప్పిన దానికి నిత్య ఒప్పుకుంది. కానీ పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకోవడం గోపికి ఇష్టంలేదు. దాంతో ప్రతి రోజూ నిత్యతో గొడవ పడేవాడు. చివరకు కొట్టడం మొదలుపెట్టాడు. ఒక రోజు బాగా కొట్టి నిత్యను వాళ్ళ అమ్మ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి పని దగ్గర నుంచి వచ్చి విషయం తెలుసుకుని నిత్యను ఆస్పత్రిలో చేర్పించింది. విషయం బంధువుల దగ్గరకు వెళ్ళింది. వెంటనే నిత్య మేనమామ ఇద్దరికీ పెండ్లి చేద్దామని గోపి కోసం వాళ్ళ రూమ్‌కి వెళ్ళాడు. కానీ అక్కడ అతను లేడు. నిత్యను మోసం చేసి, ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా ఎటో వెళ్ళి పోయాడు. నిత్యకు అతని పేరు మాత్రమే తెలుసు. అతని కుటుంబ సభ్యుల గురించి గానీ, ఊరి గురించి గానీ తెలియదు. కనీసం అతని తల్లిదండ్రుల పేర్లు కూడా తెలియదు. గోపి ఆధార్‌ కార్డు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఐద్వా లీగల్‌ సెల్‌ దగ్గరకు వచ్చారు.
నిత్య సమస్య మొత్తం విన్న సభ్యులకు ‘అసలు గోపి నిజంగా నిత్యను ప్రేమించి ఉంటే ఇలా వదిలేసి ఎందుకు వెళ్లిపోతాడు. తన వివరాలు ఏవీ ఆమెకు తెలియకుండా ఎందుకు జాగ్రత్తపడ్డాడు’ ఇలా ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఎలాగో ఆరా తీస్తే అతనికి ఇంతకు ముందే పెండ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం తెలిసింది. ఇదే విషయాన్ని లీగల్‌సెల్‌ సభ్యులు నిత్యకు చెప్పారు. ‘గోపితో నీకు జరిగిన పెండ్లికి ఎలాంటి ఆధారాలు లేవు. కావాలనే అతను ఆధారాలు లేకుండా చేశాడు. నిన్ను మోసం చేయాలని అతను ముందే ప్లాన్‌ చేసుకున్నాడు. జీవితం పట్ల ఎంతో అవగాహన ఉన్నదానివి, చెల్లెళ్లకు తల్లిగా మారి వారి మంచి చెడులు చూడాలనుకున్నావు. ఇలా అతని మాయలో పడ్డావు. గుడ్డిగా నమ్మేశావు.
ఇక అతని గురించి ఆలోచించి నీ సమయం వృధా చేసుకోకు. మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించు. నువ్వంటే మీ బావకు చాలా ఇష్టమట. మీ మామయ్య చెప్పాడు. అతనితో కూడా మేము మాట్లాడటం. మీ బావను పెండ్లి చేసుకుని హాయిగా ఉండు. గోపిని ఓ పీడ కలగా మర్చిపో’ అన్నారు. ‘మీరు చెప్పింది నిజమే మేడమ్‌. ఏమీ ఆలోచించకుండా అతను ప్రేమిస్తున్నా అన్న వెంటనే నమ్మేశాను. నాకు బాగా బుద్ధి చెప్పాడు. మా బావా చాలా మంచి వాడు. ఇప్పటికీ నన్ను పెండ్లి చేసుకుంటా అన్నాడంటే ఎంత గొప్ప మనసు..! ఇన్ని రోజులు నా వాళ్ళందరినీ బాధ పెట్టాను. ఇకపై మీరు చెప్పినట్టే నడుచుకుంటాను’ చెప్పి నిత్య వెళ్ళిపోయింది..
ఏడాది తర్వాత నిత్య తన బావతో కలిసి తన పాపను తీసుకుని లీగల్‌సెల్‌కు వచ్చింది. ఐద్వాకు నేను చాలా రుణపడి ఉంటాను. నా జీవితం ఎటుపోతుందో అనుకున్నప్పుడే ఒక మంచి మార్గం చూపించారు. నేను ఇప్పుడు నా భర్త, పాపతో చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణం ఐద్వానే. మీరు నాలాంటి చాలా మంది అమ్మాయిలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మాదిరిగా మరే అమ్మాయి ప్రేమ పేరుతో మోసపోకూడదు’ చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love