నీటి మీద రాతలే…!

Writing on water...!– దిక్కూ మొక్కూ లేని ప్రధాని గ్యారంటీలు
– కాలగర్భంలో కలసిపోతున్న పథకాలు
–  ఆత్మస్తుతి…పరనిందతో కాలక్షేపం
న్యూఢిల్లీ : దేశంలోని రెండున్నర లక్షల పంచాయతీల ను చుట్టివచ్చేలా బీజేపీ ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పదిహేను వందల వాహనాలను ఉపయోగించారు. జీపీఎస్‌, డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మోడీ ప్రసంగాలతో, ఆయనను కొనియాడుతూ ఆలపించిన గీతాలతో హోరెత్తించారు. ఈ యాత్ర కోసం ప్రభుత్వ అధికారులను వినియోగించారు. అయితే ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ యాత్ర పేరును మోడీ స్వయంగా ‘మోడీ కీ గ్యారంటీ వెహికల్‌’గా మార్చేశారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను ఆపేసి వాహనాలపై భారత్‌ ప్రభుత్వం అని కాకుండా మోడీ ప్రభుత్వం అని ఎందుకు రాశారంటూ నిలదీశారు. అహ్మద్‌నగర్‌, నాసిక్‌, సతారా, జల్నా, పర్బనీ, అకోలా, హింగోలీ, నాందేడ్‌, రత్నగిరి, బుల్‌ధానా వంటి చోట్ల ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. వాహనాల మీద బీజేపీ ఎన్నికల గుర్తు కమలం కన్పించడంపై కొందరు అభ్యంతరం చెప్పారు. నిరసన దృశ్యాలను వీడియో కూడా తీశారు. రాజధాని ఢిల్లీలో గ్యారంటీ వాహనాన్ని పలు చోట్ల అడ్డుకొని నిరసన తెలిపారు. మోడీ ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడమేమిటని ప్రశ్నించారు.
హామీల స్కోరు 142
గత పది సంవత్సరాల కాలంలో మోడీ ఎన్ని పథకాలు ప్రకటించారో ఎవరికీ తెలియదు. సీనియర్‌ పాత్రికేయుడు పి.రామన్‌ లెక్క ప్రకారం మోడీ ఇచ్చిన హామీలు అక్షరాలా 142. 2015, 2016 సంవత్సరాల్లో ప్రకటించిన పథకాల్లో 40 పథకాల లోగోలకు ఆమోదం లభించింది. కనీసం 20 పథకాల పేర్లకు ముందు పీఎం అని జోడించారు. పీఎం కిసాన్‌, పీఎం ఆవాస్‌ యోజన ఇందుకు ఉదాహరణ. మోడీకి ఇష్టమమైన పదం ‘అమృత్‌’ పేరిట కొన్ని పథకాలు ప్రారంభమయ్యాయి. అమృత్‌ కాల్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు వంటివన్న మాట.
మదింపు, సమీక్షలు ఏవి?
అయితే మోడీ పథకాల అమలును మదింపు చేసిన వారెవ్వరూ లేరు. దానికి సంబంధించిన గణాంకాలు కూడా అందుబాటులో లేవు. దీనిపై ప్రధాన మీడియాలో సైతం వార్తలు రావడం లేదు. మోడీ గ్యారంటీలపై ఏ నాడూ సమీక్ష జరిగిన పాపాన పోలేదు. ఉదాహరణకు గంగానది శుద్ధినే తీసుకుందాం. 2014లో నమామి గంగ పేరిట ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.20,000 కోట్ల వ్యయంతో చేపట్టిన మురుగనీటి శుద్ధి ప్లాంటు పనుల్లో 2021 నాటికి కేవలం 20% మాత్రమే పూర్తయ్యాయి. కొత్తగా వంద స్మార్ట్‌ సిటీల ఏర్పాటు అనేది 2015లో మోడీ ఇచ్చిన మరో గ్యారంటీ. ఈ ప్రాజెక్టులో నాలుగు లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అమెరికా, ఫ్రాన్స్‌, చైనా వంటి 14 దేశాలు పోటీ పడ్డాయి. ఈ ప్రాజెక్టుకు రుణాలు అందించేందుకు ప్రపంచబ్యాంక్‌, ఏడీబీ, యూఎన్‌ఏఐడీ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ అంతా గప్‌చుప్‌… ప్రస్తుతం ఉన్న నగరాలనే చిన్న చిన్న ముక్కలుగా విభజించి ఆధునీకరించే పనితో సరిపెట్టారు.
ఈ గ్యారంటీలు ఏమయ్యాయి?
ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానన్న మోడీ హామీ కూడా అమలు కు నోచుకోలేదు. ఆయన హమీపై బీజేపీ నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు కూడా చేశారు. కొందరు కేంద్ర మంత్రులు దానిని తేలిగ్గా తీసుకున్నారు . మోడీ మాటలు నమ్మిన ప్రజా నీకం మాత్రం బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు క్యూ కట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ ఇచ్చిన అనేక హామీలు నీటి మూటలేనని తేలిపోయింది. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య బులెట్‌ రైలు ప్రాజెక్టును 2014 సెప్టెంబరులో ప్రకటించారు కానీ దానిని పూర్తి చేయాల్సిన గడువును పెంచుకుంటూ పోతున్నారు. ప్రాజెక్ట్‌ వ్యయం మాత్రం రూ.1.08 లక్షల కోట్ల నుండి రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తానని ఇచ్చిన గ్యారంటీకి కూడా అతీగతీ లేదు. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా దానిని నెరవేర్చలేదు. సరికదా దేశంలో ఉద్యోగ సంక్షోభం మరింత తీవ్రమైంది. 2022 చివరి నాటికి అంతరిక్షంలోకి మనిషిని పంపుతామని 2018లో ఎర్రకోట సాక్షిగా ప్రధాని ప్రకటించారు. దేశం 2024వ సంవత్సరంలోకి ప్రవేశించినా ఎవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. దేశంలోని అన్ని గ్రామాలనూ విద్యుత్‌ వెలుగులతో నింపుతామని 2018 ఏప్రిల్‌లో మోడీ గ్యారంటీ ఇచ్చారు. ఫోర్బ్స్‌ తాజా నివేదిక ప్రకారం దేశంలో ఇప్పటికీ 3.1 కోట్ల కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి.
వీటిదీ అదే దారి
ఆధార్‌ అనుసంధానం కారణంగా గ్రామీణ ఉపాధి పథకం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. నమోదు చేసుకున్న కార్మికుల్లో 34.8% మంది, క్రియాశీలక కార్మికుల్లో 12% మంది ఉపాధి కోల్పోయారు. 2022 ఏప్రిల్‌ నుండి 7.6 కోట్ల జాబ్‌ కార్డుల్ని తొలగించారు. పీఎం కిసాన్‌ పథకంలో రెండు నుండి నాలుగు లక్షల మంది లబ్దిదారుల బ్యాంక్‌ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. మోడీ ఇచ్చిన మరో గారంటీ ‘నల్లా నుండి నీరు’. 2022 అక్టోబరులో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 13 వేల గ్రామాల్లో 5,298 గ్రామాలకు మాత్రమే రక్షిత మంచినీరు లభిస్తోంది. 62% కుటుంబాలకు మాత్రమే నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఉజ్వల యోజన లబ్దిదారులకు ప్రతి సిలిండరుపై రూ.200 సబ్సిడీ అందజేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అయితే 2022-23లో లబ్దిదారుల్లో చాలా మంది ఒక్క సిలిండర్‌ కూడా తీసుకోలేదు. కొందరు ఒక్క సిలిండర్‌తో సరిపుచ్చారు. ఆర్‌ఐటీ కింద ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ పథకంలో 9.58 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతుండగా 1.8 కోట్ల కుటుంబాలు ఒక్క సిలిండర్‌ కూడా తీసుకోలేదు. 1.51 కోట్ల కుటుంబాలు మాత్రం ఒకే ఒక సిలిండర్‌ తీసుకున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో జరుగుతున్న అక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చనిపోయిన రోగుల పేరిట పెద్ద ఎత్తున చెల్లింపులు జరిగాయని కాగ్‌ సైతం నిర్ధారించింది. యువతలో ఎన్నో ఆశలు రేపిన స్కిల్‌ ఇండియా పథకం కూడా నీరుకారిపోతోంది. కోర్సుల ఎంపిక సరిగా లేకపోవడం, కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి కారణాలతో ఈ పథకం ఆశించిన లక్ష్యాలను చేరడంలో విఫలమైంది. పీఎం గ్రామ్‌ సడక్‌ యోజన, సౌర ఇంధన కార్యక్రమానిది కూడా అదే దారి. పేదల ఆవాసాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తామని ప్రధాని గొప్పగా ప్రకటించారు. కాలగర్భంలో కలిసిపోయే పథకాల్లో దీనిని కూడా చేర్చేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో?
తనను తాను పొగుడుకుంటూ.
ఏదేమైనా ఈ కార్యక్రమం యావత్తూ మోడీకి ప్రాచుర్యం కల్పించేందుకు దోహదపడింది. కేంద్రీకృత అధికారలీలా విన్యాసాల అనివార్యతను చాటిచెప్పింది. మోడీ గతంలో అనేక సందర్భాల్లో స్వీయ పొగడ్తలతో ప్రజలను మెప్పించే ప్రయత్నం చేశారు. అన్ని ఇతర పార్టీలు తప్పుడు హామీలు ఇస్తున్నందున ప్రజలు మోడీ గ్యారంటీలను విశ్వసిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన కఠోర శ్రమను, అంకితభావాన్ని, పట్టుదలను ఈ గ్యారంటీ ప్రతిబింబిస్తోందని అన్నారు. ఆశ సన్నగిల్లినప్పుడు మోడీ కీ గ్యారంటీ మొదలవుతుందని తెలిపారు. తాను మాత్రమే హామీని అమలు చేస్తానని ఈ గ్యారంటీ అర్థమని కూడా ఉద్ఘాటించారు. మోడీ గ్యారంటీ సూపర్‌ హిట్‌ అయిందని వారణాసిలో చెప్పారు. త్రిస్సూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో 19 నిమిషాల పాటు ప్రసంగించిన మోడీ 18 సార్లు మోడీ గ్యారంటీ అనే పదాన్ని ఉపయోగించారు. ఇలా మోడీ అనేక సందర్భాలలో ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేశారు.

Spread the love