– గొర్రెల స్కీం నుంచి గొల్లకుర్మలు నగదు ఉపసంహరణ
– రాష్ట్రవ్యాప్తంగా రెండో (బీ) జాబితాలోని 3.54 లక్షల మంది పరిస్థితి అధోగతి
– ఖమ్మం జిల్లాలో వెయ్యి మంది వరకు వెనక్కి..
– ఒక్కొక్కరిపై రూ.20వేల వడ్డీ భారం
– రూ.2 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ అమలయ్యేనా?
‘కుల వృత్తులకు జీవం పోయాలె.. గొల్ల కురుమల జీవితాలు మారాలె.. బతుకు దెరువుకు వలసెళ్లినోళ్లు వాపస్ రావాలె.. ఉన్న ఊల్లెనే పని జేయాలె.. ఆర్థికంగా ఎదగాలె.. ఇంటిల్లిపాదీ మెతుకు తినాలె..’ అని మాటలు చెప్పి 75శాతం రాయితీపై గొర్రెల యూనిట్ పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. 20 నెలల క్రితం నగదు చెల్లించిన రెండో జాబితా (బీ)లోని గొల్ల కురుమలకు తీరని అన్యాయం చేసింది. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఒక్క యూనిట్ మంజూరు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 3,54,791 మంది గొల్ల, కురుమల సొసైటీ సభ్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కారాయిగూడెం నుంచి కె. శ్రీనివాసరెడ్డి,ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గొల్ల కురుమలు ఒక్కొక్కరు తమ వాటాధనంగా రూ. 43,750 చెల్లించారు. 20 నెలలుగా తమకు రావాల్సిన రూ.1.75 లక్షల విలువైన ఒక్కో యూనిట్ (20 గొర్రెలు, పొట్టేలు) కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ. రెండు లక్షలు ఈ పథకం దరఖాస్తుదారులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో బడ్జెట్ సమావేశాల వరకు ఆశతో ఉన్నారు. కానీ మొన్నటి బడ్జెట్‌లో ఈ పథకం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. మరోవైపు గత ప్రభుత్వం అమలు చేసిన ఈ స్కీమ్‌లో అవినీతి చోటు చేసుకున్నట్టు ‘కాగ్’ నివేదిక ఇవ్వడం.. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నలుగురు అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకోవడం.. అన్నింటికీ మించి అప్పు చేసి డీడీలు తీసిన రూ. 43,750కి వడ్డీలు చెల్లించడం భారం కావడంతో దరఖాస్తుదారులు నగదు వెనక్కి తీసుకుంటున్నారు. ఒక్కో సభ్యుడు నూటికి నెలకు రూ.2 నుంచి రూ.4 వరకు వడ్డీతో అప్పు తెచ్చారు. ఇప్పుడు ఆ వడ్డీ రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చేరింది.
ఎన్నికల స్కీమ్‌గా మారిన గొర్రెల పంపిణీ పథకం..
మొదటి నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ పథకం అస్తవ్యస్తంగానే సాగుతోంది. ఎన్నికలున్నప్పుడు కొన్ని యూనిట్లు మంజూరు చేయడం ఆ తర్వాత దీని గురించి పట్టించుకోకపోవడం ఆనవాయితీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,135 సొసైటీలు ఉండగా 7,46,179మంది సభ్యులు ఉన్నారు. వీరిని ఏ, బీ జాబితాగా విడదీశారు. మొదటి(ఏ) జాబితాలో ఉన్న సుమారు 3.60లక్షల మందికి తొలుత ఒక్కో యూనిట్‌కు రూ.1.25లక్షల చొప్పున చెల్లించారు. బీ జాబితాకి వచ్చే సరికి యూనిట్ విలువ రూ.1.75లక్షలకు పెంచారు. సొసైటీ సభ్యుల వాటాధనంగా రూ.43,750 చెల్లించాల్సిందిగా నిర్ధారించారు. 2022 జూన్, జులై నెలల్లో సభ్యులు డీడీలు తీశారు. ఏ జాబితాలో అవినీతి ఆరోపణలు చోటు చేసుకోగా.. బీ జాబితా నాటికి అసలు సబ్సిడీ గొర్రెలు ఇవ్వడమే ప్రభుత్వం మరిచింది. బీ జాబితాలో 3,54,791మంది తమ వాటాధనం చెల్లించి గొర్రెల పంపిణీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 332సొసైటీలు ఉండగా 33,560మంది సభ్యులకు గాను 16,382మంది బీ జాబితాలో అర్హత సాధించగా 10,508మంది లబ్ది పొందేందుకు నగదు చెల్లించారు.
మొత్తం రూ.46కోట్లు జిల్లా కలెక్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. వీరంతా 20 నెలలుగా ప్రభుత్వ వాటాధనం కోసం ఎదురుచూస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆ నియోజకవర్గంలోని 4వేల మంది సభ్యులకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల యూనిట్ల కోసం నగదు జమ చేసింది. కానీ.. విత్ డ్రా చేయకుండా ఫ్రీజింగ్‌లో పెట్టింది. 780మందికి మాత్రమే ఇచ్చి.. ఎన్నికల అనంతరం వెంటనే ఆ మొత్తాన్ని ప్రభుత్వం తమ ఖాతాలోకి జమ చేసుకుంది.
కాంగ్రెస్ రూ.2లక్షల హామీ అమలయ్యేనా..?
కాంగ్రెస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో గొల్ల, కురమలకు రూ.2లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ అంశానికి సంబంధించి ప్రస్తావన లేకపోవడంతో సభ్యులు తమ నగదును వెనక్కు తీసుకుంటున్నారు. గ్రీవెన్స్‌లో డబ్బులు వాపసు ఇవ్వాలని సభ్యులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకానికి నగదు విడుదల చేస్తే నష్టపోతారని కలెక్టర్లు, అధికారులు వారికి సూచిస్తున్నా అప్పు భారం, అనారోగ్య సమస్యలతో పలువురు డబ్బులు వెనక్కు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో గడిచిన వారం రోజుల్లో వెయ్యి మంది వరకు డబ్బులు వెనక్కు తీసుకోగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా అభ్యర్థనలు వస్తున్నట్టు ఆ జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉంది.
కారాయిగూడెంలో 85 మంది ఉపసంహరణ..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెంలో 85 మంది సభ్యులున్నారు. వీరంతా గొర్రెల పంపిణీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ నగదును వెనక్కి తీసుకుంటున్నట్టు కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పథకం అమలు చేస్తే లబ్ది చేకూరదని చెప్పినా.. ఆర్థికభారంతో ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నారు.
ఒకవేళ పథకం అమలు చేసేటట్టయితే తమ వాటాధనాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మండలానికి మంజూరైన వంద దళితబంధు యూనిట్లలో ఇదే గ్రామంలో 75 దళిత కుటుంబాలుంటే వారికి ఎలాంటి నగదు చెల్లించకుండా రూ.10 లక్షలు విలువ చేసే 75 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ పరిస్థితి గ్రామస్తుల మధ్య సామాజిక విభేదాలకు కారణమైందని గొర్రెలే జీవనాధారంగా జీవించే కట్టబోయిన వెంకటేశ్వరరావు వాపోయారు.
నగదు వెనక్కి తీసుకున్నా లబ్ది చేకూర్చాలి..
గత ప్రభుత్వంలా ఈ ప్రభుత్వం వ్యవహరించొద్దు. ఆర్థిక ఇబ్బందులతో నగదు వెనక్కు తీసుకుంటున్న సభ్యులకు కూడా లబ్ది చేకూరేలా ప్రభుత్వం చూడాలి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలు సభ్యులందరికీ ఇవ్వాలి.
– చింతలచెర్వు కోటేశ్వరరావు, తుషాకుల లింగయ్య
తెలంగాణ గొర్రెల, మేకల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు