నవతెలంగాణ – కామారెడ్డి : అరుదైన, ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధి థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా (టీటీపీ) తో బాధపడుతున్న నిజామాబాద్‌కు చెందిన యువ గర్భిణికి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. క్లిష్ట పరిస్థితిలో ఆసుపత్రిలో చేరిన గర్భిణిని హెమటాలజీ వైద్య బృందం వెంటనే పరీక్షించి వ్యాధిని నిర్ధారించింది. అనంతరం చికిత్సా ప్లాస్మా మార్పిడి (ప్లాస్మాఫెరెసిస్) తో పాటు స్టెరాయిడ్ చికిత్సను ప్రారంభించారు. ఈ చికిత్సకు రోగి అద్భుతంగా స్పందించడంతో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా మెరుగుపడి ఆరోగ్యం స్థిరపడింది. ప్రస్తుతం గర్భం సురక్షితంగా కొనసాగుతోందని, తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
హెమటాలజీ, గైనకాలజీ వైద్య బృందాల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. యశోద ఆసుపత్రి సోమాజిగూడ కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద విజిట్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వైద్య నిపుణుడు డాక్టర్ జి. విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. టీటీపీ చాలా అరుదైనప్పటికీ ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితి అని తెలిపారు. చికిత్స ఆలస్యం అయితే పరిస్థితి వేగంగా విషమించే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డను కాపాడేందుకు వ్యాధిని త్వరగా గుర్తించి వెంటనే ప్లాస్మా మార్పిడి చికిత్స ప్రారంభించడం కీలకమన్నారు. ఈ కేసు సకాలంలో నిపుణుల జోక్యం, వివిధ వైద్య విభాగాల సమన్వయంతో కూడిన చికిత్స ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు.
టీటీపీ అంటే ఏమిటి?
టీటీపీ అనేది శరీరంలోని చిన్న రక్తనాళాల్లో సూక్ష్మ రక్తం గడ్డలు ఏర్పడే అరుదైన రక్త వ్యాధి. దీనివల్ల ప్లేట్లెట్లు తీవ్రంగా తగ్గడంతో పాటు ఎర్ర రక్త కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మెదడు, మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలపై కూడా ప్రభావం పడవచ్చు. గర్భధారణ సమయంలో కనిపించే కొన్ని ఇతర సమస్యల లక్షణాలతో టీటీపీ లక్షణాలు పోలి ఉండే అవకాశం ఉన్నందున వ్యాధిని సకాలంలో గుర్తించడం అత్యంత కీలకమని వైద్యులు తెలిపారు. యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన పరీక్షలు, ప్లాస్మా మార్పిడి సదుపాయాలు, వివిధ వైద్య విభాగాల సమన్వయంతో అందించిన చికిత్సతో ఈ అరుదైన కేసులో విజయవంతమైన ఫలితం సాధించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కామారెడ్డిలో ప్రతి నెల రెండో మంగళవారం డాక్టర్ విక్రమ్ కుమార్ అందుబాటులో ఉంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు నిపుణుల వైద్య సలహాలు పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మూడు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తోందని, హైదరాబాద్‌లో సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట్, హైటెక్ సిటీల్లో నాలుగు ఆసుపత్రులతో క్లిష్టమైన, అరుదైన వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రెస్‌మీట్‌లో యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ సీనియర్ మేనేజర్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.


