నీ జీవితం గుణ‌పాఠం కావాలి

Your life needs a lesson.దివ్యకు 26 ఏండ్లు ఉంటాయి. ఎమ్మె పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఎన్‌ఆర్‌ఐ అయిన నిఖిల్‌తో 2024లో పెండ్లి జరిగింది. వారి పెండ్లి ఖర్చులకు సుమారు 50 లక్షలు ఖర్చు చేశారు. ఇవి కాక హైదరాబాద్‌లో ఒక ఇల్లు, కారు, 45 తులాల బంగారం, కిలో వెండి ఇచ్చారు. అయితే అబ్బాయి ఉండే దేశంలోనే వారి కోసం ఇల్లు కొనాలని అనుకున్నారు. దాని కోసం నిఖిల్‌ తల్లి దండ్రులు ‘ముందే సగం డబ్బులు మేము ఇచ్చాము. మిగిలిన సగం కూడా ఇచ్చేస్తే ఇల్లు వీరి పేరు మీద రిజిస్టర్‌ అవుతుంది. మీరు కట్నం డబ్బులు ఇస్తే వాటితో ఆ పనులు పూర్తి చేస్తాం’ అని అమ్మాయి వాళ్లతో అన్నారు. ఇల్లు కోసమే కదా అని దివ్య తల్లిదండ్రులు 70 లక్షల వరకు ఇచ్చారు. నిఖిల్‌ ఆ డబ్బులు తీసుకొని అతని పేరుతో ఇల్లు కొన్నాడు. అయితే అందులో దివ్య పేరు లేదు.
దివ్య ఉద్యోగం చేయడం నిఖిల్‌కు నచ్చలేదు. ‘పెండ్లి తర్వాత మన మిద్దరం వేరే దేశంలో ఉంటాము. అలాంటప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు, మనేయవచ్చు కదా’ అన్నాడు. దానికి ఆమె ‘వెంటనే మానేస్తా అంటే వాళ్లు ఒప్పుకోరు. ఎలాగో పెండ్లికి మూడు నెలలు టైం ఉంది కదా, అప్పుడు మానేస్తాలే’ అని నచ్చజెప్పింది. ‘కావాలంటే నువ్వు అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగం చేయవచ్చు’ అని అన్నాడు. దానికి దివ్య ఒప్పుకుని ఉద్యోగం మానేసింది. పెండ్లి ఘనంగా చేశారు. పెండ్లి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. నిఖిల్‌ పెండ్లికి వారం రోజులు ముందు ఇండియాకి వచ్చాడు. పెండ్లి తర్వాత రెండు నెలలకే వెళ్లిపోయాడు. ఈలోపు దివ్యకు వీసా ప్రాసెస్‌ అంతా చేయించాలి. కానీ దాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరం కలిసి వెళదాం అన్నా ‘నా వీసా టైం అయిపోతుంది. నేను అక్కడికి వెళ్లి ఆ ప్రాసెస్‌ చేస్తాను. నువ్వు త్వరలోనే అక్కడికి రావొచ్చు’ అని చెప్పి వెళ్లిపోయాడు.
ఉన్న ఆ రెండు నెలల్లో కూడా ఒక నెల అబ్బాయి తల్లిదండ్రులు గుళ్లూ, గోపురాలు, మొక్కులూ అంటూ తిప్పారు. ఆ తర్వాత హనీమూన్‌ అంటూ ఒక 20 రోజులు తిరిగారు. ఆ తర్వాత నుండి ‘నేను వెళ్లాలి, ఆఫీస్‌ నుండి ఫోన్లు వస్తున్నాయి. నువ్వు ఇక్కడు అమ్మవాళ్ల దగ్గర ఉండు. వాళ్లతో పాటు నీకు కూడా వీసా పంపిస్తాను. అందరూ కలిసి రావొచ్చు’ అని ఎంతో నమ్మకంగా చెప్పి వెళ్లిపోయాడు.
వెళ్లిన దగ్గర నుండి అతని నుండి ఎలాంటి ఫోనూ లేదు. దివ్య ఫోన్‌ చేసినా అసలు మాట్లాడడు. కనీసం వాళ్ల అమ్మకు ఫోన్‌ చేసినప్పుడైనా మాట్లాడతాడా అంటే ‘నేను వర్క్‌లో ఉన్నాను. తర్వాత ఫోన్‌ చేస్తాను’ అంటూ కట్‌ చేస్తాడు. ఇక్కడ ఇంట్లో అత్తమామలు ‘నిఖిల్‌ ఇక్కడ లేడు కదా! నువ్వు మాత్రం ఎందుకు, వాడు వీసా పంపించే వరకు మీ ఇంటికి వెళ్లి ఉండు. నువ్వు అసలు ఏమీ బాగోలేదు. నా కోడలు ఎంతో అందంగా ఉండాలనుకున్నాను. కానీ నువ్వు ఇలా ఉంటే రేపు నీకు పుట్టబోయే పిల్లలు కూడా ఇలాగే ఉంటారు. పైగా నీకు ఒక్క పని కూడా రాదు. తినడం మాత్రం వచ్చు’ అంటూ తిట్టేవారు.
దాంతో దివ్య మానసికంగా బాగా నలిగిపోయింది. అక్కడే ఉండి ఆ మాటలు భరించడం కంటే పుట్టింటికి వెళ్లడమే మంచిదని అక్కడకు వెళ్లిపోయింది. దాంతో నిఖిల్‌ ‘నిన్ను మా అమ్మానాన్న దగ్గర ఉండమంటే మీ ఇంటికి వెళ్లిపోతావా! నీకు మా అమ్మానాన్న అంటే లెక్కలేదు. ఇక నువ్వు అక్కడే ఉండు. నీకూ నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ మెసేజ్‌ పెట్టాడు. దివ్య సర్ది చెప్పాలనుకున్నా వినిపించుకోలేదు. వాళ్ల అత్తమామలు కూడా ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక దివ్య ఐద్వా ఆఫీస్‌కు వచ్చింది.
మేము నిఖిల్‌ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశాము. కానీ వాళ్లు అప్పటికే ఉండే ఇల్లు, ఫోన్‌ నెంబర్లు మార్చేశారు. నిఖిల్‌తో మాట్లాడితే నాకు ఏమీ తెలియదు. మా అమ్మానాన్నలు నాకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా దివ్యతో నాకు పెండ్లి చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆమెతో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేకుండా ఆమెతో జీవితాంతం కలిసి ఎలా ఉండాలి? ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకుంటాను’ అన్నాడు.
దానికి మేము ‘వాళ్లు మీకు ఇచ్చింది ఎంత, మీరు ఆమెకు ఏమిస్తారు? మీ పెండ్లికి వాళ్లు దాదాపు రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టారు. దానికి డబుల్‌ ఇస్తారా! అయినా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదు. ముందు మీరు ఇండియాకి వచ్చి మాట్లాడండి’ అంటే, ‘లేదు నేను ఇండియాకు రాను. మీరు ఏం చేసుకోగలిగితే అది చేసు కోండి’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు. దివ్య వాళ్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దాంతో దివ్య ‘నేను వెళ్లి నిఖిల్‌ని కలిసి వస్తాను. నన్ను ఎందుకు మోసం చేశాడో అక్కడే తేల్చుకుంటాను’ అని వెళ్లింది.
అక్కడికి వెళ్లి చూస్తే నిఖిల్‌కు ముందే పెండ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్నారు. దివ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్లు ఒక ప్లాన్‌ ప్రకారమే తనని మోసం చేశారని అర్థమయ్యింది. దాంతో ఇండియా తిరిగి వచ్చి అతనిపై కేసు పెట్టి నోటీసులు ఇస్తే అప్పుడు అతను ఇండియా వచ్చి దివ్యతో మాట్లాడాడు. ‘నిఖిల్‌కు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ల ముఖం చూసి అయినా అతన్ని వదిలేయండి’ అని లాయర్‌తో మాట్లాడించారు. దానికి ఆమె ‘మేము ఇచ్చిన డబ్బులు మొత్తం మాకు ఇవ్వమనండి’ అంది. అడ్వకేట్‌తో మాట్లాడి వాళ్లు ఇచ్చిన బంగారు, ఇల్లు, కట్నం డబ్బు మొత్తం తిరిగి తీసుకున్నారు. దివ్య అతని నుండి విడాకులు తీసుకుంది. నిఖిల్‌ తిరిగి వెళ్లిపోయాడు.
దివ్య కూడా అలాంటి మోసగాడి నుండి విడిపోయినందుకు సంతోషంగా ఉంది. వేరే ఉద్యోగంలో చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కొద్ది రోజుల కిందట ఐద్వా ఆఫీస్‌కు ఫోన్‌ చేసి ‘మేడమ్‌ నాలాంటి అమ్మాయిలు ఎందరో ఇలా ఎన్‌ఆర్‌ఐల చేతిలో మోసపోతున్నారు. అలాంటి వారికి నా జీవితం ఒక గుణపాఠం కావాలి. సమస్యల నుండి ఎలా బయటపడాలో అందరూ తెలుసుకోవాలి. అందుకే నా సమస్య గురించి కూడా మీరు ఐద్వా అదాలత్‌లో రాయండి. ఇది చదివి కొందరైనా జాగ్రత్తగా ఉంటే నాకు అదే చాలు’ అని చెప్పింది.
– వై వరలక్ష్మి, 9948794051

Spread the love