యువత పరిశ్రమలవైపు వెళ్లాలి స్థానికులకే ఉద్యోగాలు

Minister KTR– ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌
– సీతారాంపూర్‌, చందనెళ్లిలో సింటెక్స్‌, కిటెక్స్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ-షాబాద్‌
యువత రాజకీయాలు, రియల్‌ ఎస్టేట్‌ వైపే కాకుండా పరిశ్రమల స్థాపన వైపు వెళ్లాలని ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి తారకరామరావు అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని చెప్పారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో ఆయన పర్యటించారు. సీతారాంపూర్‌ స్టేజీ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సీతారాంపూర్‌ గ్రామ సమీపంలోని కిటెక్స్‌, చందన్‌వెల్లి గ్రామ సమీపంలో సింటెక్స్‌ పరిశ్రమలకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే ఏడేండ్లలో చందన్‌వెళ్లి, సీతారాంపూర్‌లో వెల్స్‌పన్‌ గ్రూప్‌ రూ.ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడుతోందన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. గుజరాత్‌, కర్నాటక రాష్ట్రాల్లో పెట్టాల్సిన ప్లాంట్లను తెలంగాణలో పెట్టారని, దీనికి కారణం సీఎం కేసీఆర్‌ సమర్థ నాయకత్వమేనని అన్నారు. స్థానిక యువతకే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. చేవెళ్ల, వికారాబాద్‌, తాండూర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లిలో ఐటీతోపాటు టూరిజం అభివృద్ధి చెందిందన్నారు. పరిగిలో ఆహార శుద్ధి పరిశ్రమ ఉందన్నారు. యువత రాజకీయాలు, రియల్‌ ఎస్టేట్‌ వైపు కాకుండా పరిశ్రమల వైపు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. సమాచార, పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ కృషితో రంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారిందన్నారు. రూ.370 కోట్ల పెట్టుబడులతో వెయ్యి మందికి ఉద్యోగ కల్పన వస్తుందన్నారు. జిల్లాలో రూ.62 వేల 832 కోట్ల పెట్టుబడులతో 1,358 పరిశ్రమలు స్థాపించగా.. వీటిలో ఏడు లక్షల ఆరు వేల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారన్నారు. రూ.1400 కోట్ల పెట్టుబడులతో సింటెక్స్‌ పరిశ్రమలో 12వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వికారాబాద్‌ జిల్లాలోనూ అనువైన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరీష్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్‌ రెడ్డి, టీఎస్‌ఎస్‌ఐసీ ఎండీ వెంకట్‌, వెల్స్‌పన్‌ గ్రూప్‌ అధినేత బాలకృష్ణ గోయంక, కిటెక్స్‌ జాకబ్‌, ఆర్డీఓ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Spread the love