రవాణా రంగంలో అనేక సంస్కరణలు
2932 కొత్త బస్సుల కొనుగోలు
1024 ఎలక్ట్రిక్ బస్సులతో సేవలు
దేశంలోనే నెం.1 ఆర్టీసీగా గుర్తింపునకు కృషి : రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రజా పాలన ప్రభుత్వంలో వెయ్యి రోజుల్లో రవాణా రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళా సాధికారత, ఉద్యోగ సంక్షేమం, ఆధునిక ప్రజా రవాణాకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామనీ, 1,024 ఎలక్ట్రిక్ బస్సులతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో రవాణా శాఖ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్‌తో కలిసి వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని దేశంలోనే నంబర్-1గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విజన్ 2047 కి అనుగుణంగా ఆర్టీసీ మరింత ముందుకు పోతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారనీ, తద్వారా మహిళలు సుమారు రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు. మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా రవాణా రంగంలో యజమానులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా సెర్ఫ్ , మహిళా సంఘాల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేయించి వాటి నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామనీ, ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులతో అధికారుల కమిటీ ఏర్పాటు చేసి విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 370 కొత్త రూట్లలో బస్సు సర్వీసులు నడుపుతున్నామనీ, గ్రామాల్లోనూ ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు సర్వీసులను విస్తరిస్తున్నామని చెప్పారు. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, ఆర్టీసీ సమన్వయంతో లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. ఆటో కార్మికులు సమ్మెలోకి వెళ్లకుండా వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి తెలిపారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామనీ, వారం రోజుల్లో సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్‌లో డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా రెట్రోఫిట్ చేసుకునేందుకు ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు. బైక్ ట్యాక్సీలకు ఎల్లో ప్లేట్ ఏర్పాటు చేసే అంశంపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ప్రజాప్రభుత్వంలో విప్లవాత్మక పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



