కొలువు సవాల్‌

– కష్టంగా మారిన నాణ్యమైన ఉద్యోగాల సాధన
– మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావం
– దేశంలోని యువత,నిరుద్యోగులకు క్లిష్ట కాలం
– బడ్జెట్‌లోనైనా ఏదైనా పరిష్కారం చూపాలి
– ఆర్థిక నిపుణులు, విశ్లేషకుల సూచన
న్యూఢిల్లీ : దేశంలో ప్రతి రంగాన్ని కుదేలు చేసిన కరోనా మహమ్మారి సామాన్య ప్రజల నుంచి చిన్న వ్యాపారుల వరకు.. ప్రతి ఒక్కరికీ వివత్కర పరిస్థితులను చూపింది. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేసిన లాక్‌డౌన్‌, పెద్ద నోట్ల రద్దు దుష్ప్రభావాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, దేశంలోని యువత కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పటి వరకు తమకున్న ఉద్యోగాలను కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. దీంతో వారి ఆశలన్నీ అడడియాశలయ్యాయి. కరోనా ముందు వరకూ ఆర్థిక మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనదశలో ఉన్నది. అయినప్పటికీ.. ఆ పరిస్థితుల్లోనూ దేశ యువత కొంత వరకు నిలదొక్కుకున్నారు.

అయితే, కరోనానంతరం పరిణామాలు ఒక్కసారిగా వారి జీవితాలను తలకిందులుగా చేశాయి. ఆకర్షణీయమైన జీతాలు, ఒక స్థిరమైన హౌదాలో ఉన్న ఉద్యోగులందరిలో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాంటి ఉద్యోగులు బతుకు బండి నడవటం కరోనా కాలంలోనూ, ఇప్పటికీ.. తమకు సంబంధం లేని పనులను చేస్తున్నారు. కొందరు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో నెట్టుకొస్తుంటే.. మరికొందరు ఉదయం నిద్ర లేచింది మొదలు.. అర్ధరాత్రి వరకు ఒకటికి పైగా ఉద్యోగాలను చేస్తున్న పరిస్థితులు కనబడ్డాయి.
”నేను హౌరాలోని మెటల్‌ వర్క్స్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసేవాడిని. అయితే, కరోనా పరిస్థితులతో ఆ ఉద్యోగం కోల్పోయాను. లాక్‌డౌన్‌ సమయంలో పోస్టా మార్కెట్‌కు సమీపంలోని ఉంటూ.. గోనె సంచులలో వ్యాపారం చేసే హౌల్‌సేల్‌ సంస్థలో పార్ట్‌టైమ్‌ పని చేస్తున్నాను. అలాగే, ఒక ఫుడ్‌కోర్టులో క్యాషియర్‌గా చేస్తున్నాను” అని కోల్‌కతాలోని ఒక వ్యక్తి తెలిపాడు. అయితే, ఈ రెండు ఉద్యోగాల కారణంగా జీవిత నాణ్యత పడిపోయందని సదరు వ్యక్తి వాపోయాడు. ఎక్కువ పని గంటలు, ఆరోగ్యం, భవిష్యత్తుకు సంబంధించి భరోసా లేకుండానే ఈ ఉద్యోగాలను చేయాల్సి వస్తున్నదని చెప్పాడు. ఇతను మాత్రమే కాదు.. దేశంలోని చాలా మంది యువత, నిరుద్యోగుల పరిస్థితి ఇలాగే ఉన్నదని నిపుణులు, విశ్లేషకులు చెప్పారు. మహమ్మారి ప్రేరిత వ్యాపార మాంద్యం తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకోవడంతో ఉద్యోగాలు కొంత ఏర్పడ్డాయి. కానీ, ఆ ఉద్యోగాల నాణ్యత తరచుగా అస్పష్టంగా ఉన్నది. ఎందుకంటే వాటిలో ఎక్కువ భాగం అనధికారిక రంగంలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. దేశంలోని చాలా మంది యువత ఇప్పటికీ ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగులుగా మారుతున్నారని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగులకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించటం కష్టంగా తయారైందని అన్నారు. జనాభా పెరుగుదల, మహమ్మారి సమయంలో పనిని కోల్పోయిన వారితో జాబ్‌ మార్కెట్‌లో ఎక్కువ మంది కొత్తగా చేరటం, కేంద్రం నుంచి సరైన విధానాలు లేని కారణంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు.” రెండు సంవత్సరాల కోవిడ్‌ -19 నుంచి కోలుకున్న పెద్ద కార్పొరేట్‌ల ద్వారా వృద్ధి ఎక్కువగా ఉన్నది. అయితే, సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) లేదా సెమీ ఫార్మల్‌ రంగం కొంత భాగం చనిపోయింది. కొంత భాగం రెండింతల నుంచి కోలుకోలేదు. పెద్ద నోట్ల రద్దు, మహమ్మారి దెబ్బ కారణంగానే ఇదంతా..” అని ప్రఖ్యాత ఆర్థికవేత్త, జాతీయ గణాంక కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ప్రణబ్‌ సేన్‌ వివరించారు. భారత్‌లో 2011-12లో 3 శాతం లోపు.. 2017-18లో ఆరు శాతం లోపు ఉన్న నిరుద్యోగం.. ప్రస్తుతం 8 శాతం దగ్గరకు చేరుకున్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా నిరుద్యోగుల విషయంలో కేంద్రం ఏవైనా ఉపయోగపడే చర్యలు చేపట్టాలని సూచించారు. లేకపోతే దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరే ప్రమాదమున్నదని హెచ్చరించారు.

Spread the love