కార్మిక వ్యతిరేక మోడీ బడ్జెట్ ను తిరస్కరించండి

– నూర్జహాన్ సిఐటియు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-కంటేశ్వర్
2023, 2024 ఆర్థిక సంవత్సరానికి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్మికులకు, రైతులకు, శ్రమ జీవులకు, ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని పోగొట్టడానికి గానీ, పెరుగుతున్న ధరలను తగ్గించటానికి గానీ, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గానీ ఈ అడ్జెట్ దోహదపడదు. ఇది కేవలం కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న బడ్జెట్టీ, కార్మిక వ్యతిరేక బడ్జెట్ను తిరస్కరించాలని కార్మికవర్గానికి సిఐటియు జిల్లా కమిటీ పిలుపునిస్తున్నది. కార్మికులు దీర్ఘకాలికంగా చేస్తున్న      డిమాండ్ల పరిష్కారానికి ఈ బడ్జెట్ ఎటువంటి పరిష్కారం చూపలేదు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్, మధ్యాహ్న భోజనం, జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ జీవనోపాధుల మిషన్లకు మోడీ ప్రభుత్వం కేటాయింపులు పెంచలేదు. ఆకలి సూచికలో వెనుకబడటం, పోషకాహార లోపం తదితరాలతో బాధపడుతున్న ప్రజానీకానికి బడ్జెట్ ఎటువంటి రక్షణ కల్పించలేదు.గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు గణనీయంగా పెంచి పని దినాలు 200కు పెంచాలని, రోజు వేతనం రూ. 600/-లు చెయ్యాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలని కోరుతుండగా ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా గ్రామీణ ఉపాధికి కేటాయింపులలో తీవ్రంగా కోతపెట్టింది. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులను కేటాయించి, సంక్షేమ పథకాలను కార్మికులందరికీ అమలు చెయ్యాలన్న డిమాండ్ను కూడా బడ్జెట్లో పట్టించుకోలేదు, ఇపిఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ పెంచాలని లక్షలాది మంది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు చేస్తున్న ఆందోళనలను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పెన్షనర్లకు ఎటువంటి కేటాయింపులు చెయ్యలేదు. ఆదాయ పన్ను పరిమితిని రూ.2,50,000/- ల నుండి రూ. 3,00,000/- లకు ఈ బడ్జెట్లోపెంచినప్పటికీ వేతన జీవులకు పెద్దగా ఒరిగిన ప్రయోజనమేమీ లేదు. కార్పొరేట్ అనుకూల విధానాలలో భాగంగానే మోడీ ప్రభుత్వం తన తీరుకు తగ్గట్లుగా ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను కొనసాగిస్తోంది. ఈ బడ్జెట్లో కూడా రూ.61,000/-ల కోట్ల ప్రభుత్వ సంస్థలను అమ్మాలని ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల మౌలిక సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రభుత్వం సౌకర్యాలను అందుకోవాలంటే ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలని మెలిక పెట్టింది. ఆర్ధిక రంగంలో మరిన్ని సంస్కరణలను ప్రతిపాదించింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, బ్యాంకింగ్ కంపెనీల చట్టం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాలకు సవరణలు చేస్తామని చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం పూనుకుంటోంది. మరిన్ని కార్మిక, ప్రజా వ్యతిరేక సంస్కరణలు రాబోతున్నట్లుగా ఈ బడ్జెట్లో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వ్యవసాయ పరపతి సహకార రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కైంకర్యం చేస్తోంది. మోడల్ బైలాసు ప్రతిపాదించింది, రోడ్లు, రైళ్లు, విద్యుత్, టూరిజం, తదితర రంగాలలోకి ప్రైవేటు పెట్టుబడులకు అనుమతించింది.ప్రజలు వినియోగించే బ్రాండెడ్ దుస్తులు, మిగిలిన వస్తువుల ధరలు భారీగా పెంచడం అన్యాయం. గత మూడేళ్ళుగా కోవిడ్ సంక్షోభం వల్ల ఆర్ధికాభివృద్ధి రేటు మందగమనంలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో సంపదపై పన్ను వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశాలున్నప్పటికీ సంపన్నుల మీద భారం వేయకుండా సామాన్యులనే బలి చేయడానికి కేంద్ర మోడీ సర్కార్ నిశ్చయించుకున్నది. బడ్జెట్ ప్రసంగంలో ప్రపంచం తమ విజయాలను చూసి మెచ్చుకున్నట్లుగా చెప్పారు. ఈ బడ్జెట్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవాలకు చోటులేదు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను తిరస్కరించాలని కార్మికులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

Spread the love