బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు ఎలాంటి పొత్తు ఉండదు

–  కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే
– సర్వేలను బట్టి మాట్లాడా.. :ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ -శంషాబాద్‌
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదన్నారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా జరుగుతుందన్నారు. ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని తెలిపారు.
సర్వేలను బట్టి మాట్లాడా : ఎంపీ కతోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అంశం గురించి సర్వేల్లో వచ్చిన రిపోర్టులను గురించి మాత్రమే తాను మాట్లాడానని నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల సర్వే చేయించారా అనే మీడియా ప్రతినిధి ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చారు. ఈ అంశం గురించి బీజేపీ నాయకులు రాజకీయంగా వాడుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతోపాటు కాంగ్రెస్‌లోని కొంతమంది చిన్నవాళ్లు సైతం తనను విమర్శించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని రాహుల్‌ గాంధీ చెప్పిన మాటనే తాను కూడా చెప్తున్నానని తెలిపారు.

Spread the love