రుణమాఫీకి కేటాయింపులు సరిపోవు

– అవసరం రూ.19,700 కోట్లు
– ఇచ్చింది రూ.6,325 కోట్లు
– 90వేల లోపు రుణాలు మాఫీ
– రైతు నెత్తిన వడ్డీ భారం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం జంబో బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. అందులో వ్యవసాయానికి 9.2 శాతం మాత్రమే. 2021-22 వార్షిక బడ్జెట్‌తో పోల్చుకుంటే 2022-23తో రూ 700 కోట్లమేరకు తగ్గించింది. ఈసారి బడ్టెట్‌లో రూ కొంత పెంచినా, అందులో రైతురుణమాఫీకి కేటాయించిన నిధులు వారిని రుణవిముక్తులను చేయలేవు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణం తీసుకున్నారు. గత ఎన్నికల్లో లక్ష లోపు రుణమాఫీ చేస్తామని సర్కారు హామీ ఇచ్చింది. కానీ విడతల వారీగా రుణమాఫీ చేయడంతో వడ్డీ మిగిలిపోయింది. వడ్డీకి వడ్డీకి వేసి బ్యాంకులు కుప్ప చేశాయి. గతేడాది రూ 35వేల లోపు రుణమాఫీ చేసింది. కానీ ఆ రుణాలకు వడ్డీ చెల్లించలేదు. రుణమాఫీ కాకపోవడం, వడ్డీ రెట్టింపు కావడం, భారం పెరిగిపోవడం, రైతులు అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. లక్షలోపు రుణమాఫీ చేయాలంటే రూ 19,700 కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం రూ. 90వేల లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. అందుకు రూ 6,385 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో లక్షలోపు రుణమాఫీ చేస్తుందన్న ఆశలు ఆడియాలయ్యాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. కానీ ఇంత వరకు అమలు కాలేదు. దీంతో రైతులు ప్రయివేటు అప్పులబారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక జిల్ల్లాల్లో రైతులు డిఫాల్టర్లుగా మారారు. ఈ పరిస్థితుల నుంచి గట్టేక్కించాలని రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ బడ్జెట్‌ ఆశాజనకంగా లేదు
వ్యవసాయానికి బడ్జెట్‌ కేటాయింపులు ఆశాజనకంగా లేవని వ్యవసాయ విధాన విశ్లేషకులు దొంతి నర్సింహరెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో రైతుల కోసం మంచి పథకాన్ని ప్రకటిస్తారని ఆశించామని తెలిపారు. బడ్జెట్‌ కేటాయింపులు కూడా ప్రాధాన్యత పద్దతిలో లేవని గుర్తు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు ఎంతో నష్టపోయారనీ, వారిని ఆదుకునేందుకు బడ్జెట్‌ దారి చూపలేదని చెప్పారు. పత్తి, మిరప, పసుపు రైతులు నష్టపోతున్నా…వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
– వ్యవసాయవిధాన విశ్లేషకులు దొంతి నర్సింహరెడ్డి
బడ్జెట్‌ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి
ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, టి సాగర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో రైతు రుణమాఫీకి రూ.6,385 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదని పేర్కొన్నారు. అందువల్ల ఏకకాలంలో రుణమాఫీ నిధులు పెంచాలని కోరారు. బడ్జెట్‌లో పరిశోధనలకు, ప్రకృతి వైపరీత్యాల పరిహారానికి, ఉద్యానవన శాఖకు పెద్దగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందనీ, అందుకు తగిన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. కౌలు రైతులకు ఏ పథకం ప్రకటించలేదని గుర్తు చేశారు. కోతులు, పందులు, ఎలుకలు, అడవి జంతువుల బెడద వలన లక్షలాది ఎకరాలలో పంటలు దెబ్బతింటున్నాయనీ, వాటి నివారణకు బడ్జెట్‌ కేటాయించలేదని తెలిపారు. పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలనీ, ఈ క్రమంలో వ్యవసాయ బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని కోరారు.
– తెలంగాణ రైతు సంఘం

Spread the love