శ్రమజీవులకై ‘పిడికెడు బువ్వ కోసం’ కవిత్వం

కవిని ”శబ్దబ్రహ్మ” అంటారు. కవిత్వం అనేది ఒకరకమైన కళ. మాటల మాంత్రికత్వం మాటల మోహనత్వం. మనం మాట్లాడితే మండుటెండల్లో ముంచు పువ్వులు రాలినట్లు ఉండాలంటారు. అందుకే అర్థవంతమైన మాటల సముదాయం భాషగా చెప్పుకోవచ్చు. ఏ కవికైనా వస్తువును కవిత్వంగా మార్చడానికి ఉపయోగించే కవితా సామాగ్రి పదజాలమే. జీవితం నుంచి ఎదిగి వచ్చిన, శ్రమ విలువ తెలుసుకున్న కవి గంగాపురం శ్రీనివాస్‌. తన హదయంలో నుంచి కట్టలు తెంచుకొని వచ్చిన కవితా పంక్తులే ”పిడికెడు బువ్వ కోసం”. ఆరుగాలం చెమట చిందించి, పంట పండించే జీవులకు ప్రతిఫలం దక్కాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆరాటపడుతున్న అక్షర సేద్యకుడు శ్రీనివాస్‌. బాధల నుంచి స్వయంగా ఎదిగిన కవి. ధైర్యంతో ఎదుర్కొనే లక్ష్యం చేరుకొని వికసించిన కవి. కనుక దీనుల హదయాల, పరుల ఆధీనంలో ఉన్న జీవితాలకు ధైర్యం నూరి పోసి గమ్యాన్ని బోధించాడు. కవి ఏ అంశం మీద కవితలు రాసినా తప్పనిసరిగా, ప్రత్యేకంగా ఉపమాలంకారాలతో రాయడం ఆయన ప్రత్యేకత. ”పిడికెడు బువ్వ కోసం” కవితా సంపుటిలో మొత్తం 75 కవితా ఖండికలు ఉన్నాయి. ఈ కవితలు ప్రతి ఒక్కటి జీవితానికి వాస్తవంగా ఉన్నవిగా పాఠకులకు అనిపిస్తాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బాధ, స్నేహం, కార్మికులు, కర్షకులు, ఆరాధన, దేశభక్తి, ఆకలి, పల్లె, పట్నం అనేక రకమైన వస్తువులతో కవిత్వీకరించడం విశేషం. తన ఆవేశాన్ని నరనరాన పారించి, అక్షరాలతో కవిత్వం రాసిన యువ కవి శ్రీనివాస్‌. సమాజంలో జరుగుతున్న దశ్యాలను గమనించి స్పందించిన విధానం బాగుంది.
”నిండిన కుండలు ఒకవైపు
మండే కడుపులు మరోవైపు
ఆహారం వధాలు ఒకవైపు
ఆర్తనాదాలు ఒకవైపు” (ఉదయ సంధ్యలు) అంటూ తన నిరసన తెలియ చెప్పాడు.
”నా అక్షరాలు
ఆకలి కేకలు పోగొట్టే
సైనికుల చేతిలోనీ హలాలు
సరిహద్దును కాపలా కాసే
సైనికుల తుపాకీ లో తూటాలు” (నిప్పురవ్వలు) అని పదునైన భావాలను అక్షరాలుగా మలిచి దోపిడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు.
”భూ భ్రమణ విధానాన్ని
భూచక్రాలు చూపిస్తే
నాలా అపైకి ఎదగాలవి
చిచ్చుబుడ్డి నేర్పిస్తాయి” (దీపావళి విజ్ఞానవలి)
ఈ కవితలో కవి విశాల ఆశావాద దక్పథాన్ని తేట తెల్లం చేస్తుంది.
”జీవితాంతం తోడుంటానని చెప్పి
సీమంతానికి లేకపోతివి
బారసాలకు రాలేకపోతివి
చిన్నోని ముద్దు మురిపం
చూడలేకపోతివి” (చకోర పక్షి)
దేశాంతర ఎడబాటు ఏళ్ల తరబడి సరదాలు, సంతోషాలు, పుట్టిన, చచ్చిన పులకింత లేదు. రెండు వైపులా తీరని శోకాన్ని శ్రీనివాస్‌ చక్కగా చిత్రించాడు.
”చదువుల బాలశిక్ష రానోళ్లు
విలువల పెద్ద బాలశిక్షను
ఓపిగ్గా ఒంట పట్టించుకుని
నాడిపట్టి రోగం తొక్క తీసి” (పైశాచికం) అంటూ ఆసుపత్రిలో డాక్టర్ల పైసల పిచ్చితనాన్ని వివరించాడు.
యువ కవి గంగాపురం శ్రీనివాస్‌ రాసిన ప్రతి కవిత ఒక ఆణిముత్యంగా చెప్పవచ్చు. సామాజిక సమస్యల ఇతివత్తంగా రాసిన ఈ కవితల సంపుటి ఆలోచించ దగ్గది. ఇలాంటి కవితా సంపుటాలు మరెన్నో ఆయన కలం నుంచి జాలువారాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేద్దాం.
– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌
9441762105

Spread the love