– తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్
– కోఠి డీంహెచ్‌ఎస్ ఆవరణలో మహాధర్నా
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్న 104 కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ Ê హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 104 కాంట్రాక్టు ఉద్యోగులు హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ ఆవరణలో మహాధర్నా నిర్వహిం చారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నాలుగు నెలలుగా 104 కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 104 ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 2008 నుంచి డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ పద్ధతిలో జీఓ నెం 1636, మెమో నెం20639 ప్రకారం పూర్తిగా ప్రభుత్వం ఆధీనం లోనే (డ్రైవర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏఎన్‌ఎం లు) 1,350 మంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. 15 ఏండ్లుగా 104 ఉద్యోగులు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీచాలని వేతనాలతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. 2022 అక్టోబర్‌లో వాహనాలను పూర్తిగా నిలిపివేసిన సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో, టి.హబ్ సెంటర్లలో ఉద్యోగులను రీ -డిప్లై చేసిందన్నారు. రెగ్యులరైజేషన్‌కు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ నెం.60 ప్రకారం ఉద్యోగులకు స్లాబుల పద్ధతిలో వేతనాలు చెల్లించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి హైదరాబాద్‌లో ఉన్న రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. 104 ఉద్యోగులకు వారు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సొంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు. హెల్త్ కార్డు లేదా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్ చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్ కృష్ణ ప్రసాద్, ఎండీ మాజీద్, సంతోష్, ఫార్మసిస్ట్ శ్రీధర్ స్వామి, ఫార్మసిస్ట్ మల్లికార్జున్, హనుమంతరావు, విజరు కుమార్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.