131.8 కోట్లతో కార్మికుల సంక్షేమమెట్లా?

 – బడ్జెట్‌లో కార్మిక శాఖకు మొండిచేయి
– కేటాయింపులు 542 కోట్లే
– జీతభత్యాలు, అద్దెవాహనాలు, ఖర్చులకే రూ.410 కోట్లు
– భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్‌ సైకిళ్ల పంపిణేదీ?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర సర్కారు కార్మికుల సంక్షేమాన్ని మరోమారు మరిచింది. రాష్ట్రంలోని పారిశ్రామిక, అసంఘటిత రంగంలోని కోటీ 20 లక్షల మంది కార్మికుల పట్ల తన వైఖరేంటో బడ్జెట్‌లో కేటాయింపుల ద్వారా చెప్పకనే చెప్పింది. రాష్ట్ర జనాభాలో మూడో వంతుగా ఉన్న కార్మికులకు రూ. 2,90,396 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది కేవలం రూ.542 కోట్లు మాత్రమే. మొత్తంగా చూస్తే అది కేవలం 0.25 శాతమే. అందులో నిర్వహణ పద్దు కిందనే రూ.410.37 కోట్లు పోనున్నాయి. అంటే అవి ఉద్యోగుల జీతభత్యాలు, అద్దెవాహనాల చెల్లింపులు, ఇతరత్రా ఖర్చులకు వినియోగించనున్నారు. ఇదిపోనూ ప్రగతిపద్దుకు మిగిలేది రూ.131.81 కోట్లు మాత్రమే. ఇందులో ఉపాధి శిక్షణ, ఇతరత్రాలకే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా బడ్జెట్‌లో కార్మిక సంక్షేమం కోసం కేటాయింపు గుండుసున్నాగానే చూడాలి. గత బడ్జెట్‌లో లక్ష మంది భవననిర్మాణ కార్మికులకు మోటారు సైకిళ్లను పంపిణీ చేస్తామని రాష్ట్ర సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ ఒక్కమోటారు సైకిల్‌ కూడా పంపిణీ చేయలేదు. నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు రోజురోజుకీ విపరీత స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోవైపు యాజమాన్యాల తీరుతో ఉద్యోగ భద్రత కరువైంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమం గురించి కనీసం పట్టించుకోకపోవడంపై కార్మికసంఘాలు పెదవి విరుస్తున్నాయి. బతుకుబండిని లాగేందుకు కుస్తీ పడుతున్న కార్మికుల కుటుంబాల అవసరాలను ఆసరాగా తీసుకుని యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇష్టముంటే పనిచేయండి? లేకుంటే పనులకు రాకండి? అనే బెదిరింపు ధోరణులు కూడా ఎక్కువైపోతున్నాయి. పరిశ్రమలన్నీ అరకొర వేతనాలిస్తూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ట్రైనీ, ఫిక్స్‌డ్‌టర్మ్‌, తదితర పేర్లతో కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించుకుంటూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌లో జీవోలు విడుదల చేయాలనే డిమాండ్‌ను ఎనిమిదేండ్లుగా రాష్ట్ర సర్కారు పెడచెవిన పెడుతూనే ఉన్నది. ఖజానాపై పైసా భారం పడకున్నా రాష్ట్ర సర్కారు ఇలా వ్యవహరిస్తుండటంపై కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2014కు ముందు నుంచి ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను ఈ ఏప్రిల్‌ నుంచి క్రమబద్ధీకరిస్తున్నామని హరీశ్‌రావు చెప్పే క్రమంలో తమకు ఏమైనా తీపికబురు అందిస్తారేమోనని ఎదురుచూసిన కార్మికులకు తీవ్ర నిరాశే ఎదురైంది.

Spread the love