186 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేల ఆదాయ వివరాలను, క్రిమినల్‌ కేసుల చిట్టాను ఓ సర్వే సంస్థ బయటపెట్టింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 230 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 93 మంది క్రిమినల్‌ కేసులను కలిగి ఉన్నారు. ఆ 93 మందిలోనూ 47 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు నివేదించింది. ఓ ఎమ్మెల్యేపై హత్య కేసు (ఐపిసి సెక్షన్‌ 302) నమోదైంది. ఆరుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం (ఐపిసి 307), ఇద్దరు ఎమ్మెల్యేలపై నేరం (ఐపిసి 354) కింద కేసులు నమోదైనట్లు వివరించింది. రాష్ట్రంలోని 230 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 186 మంది కోటీశ్వరులు అని పేర్కొంటూ మరో ఆసక్తికరమైన నివేదికను ఎడిఆర్‌ ప్రకటించింది. రాష్ట్రంలో 129 మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 83 శాతం అంటే 107 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. ఇక 97 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో 76 మంది కోటీశ్వరులే. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో ముగ్గురు కోటీశ్వరులు. బిజెపికి చెందిన కట్ని జిల్లా విజయరాఘవగర్‌ ఎమ్మెల్యే సంజరు పాఠక్‌ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.226 కోట్లకు పైమాటే.

Spread the love