– నాలుగు జాతీయ పార్టీలతో సహా వ్యతిరేకించిన 15 పార్టీలు
– అనుకూలంగా 32 పార్టీలు
– అభిప్రాయాన్ని వెల్లడించని వైసీపీ, టీడీపీ, బీఆర్‌ఎస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏకకాల ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్‌కు తమ అభిప్రాయాన్ని తెలిపిన 47 రాజకీయ పార్టీలలో 32 ఈ ఆలోచనకు మద్దతునివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ మద్దతిచ్చిన పార్టీలలో రెండు మాత్రమే జాతీయ పార్టీలు. బీజేపీ, కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగమైనది. ఎన్నికల సంఘం గుర్తించిన మిగిలిన నాలుగు జాతీయ పార్టీలు కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏకకాల ఎన్నికలను వ్యతిరేకించాయి.
ప్యానెల్ మొత్తం 62 రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాన్ని కోరింది. 18 పార్టీలతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపింది. బీజేపీ, ఎన్సీపీ కాకుండా, ఏకకాల ఎన్నికలకు మద్దతిచ్చిన పార్టీలలో అన్నాడీఎంకే, బీజేపీ మిత్రపక్షాలు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజేఎస్‌యూ), అప్నాదళ్ (సోనీలాల్), అస్సాం గణ పరిషత్, లోక్ జనశక్తి పార్టీ (ఆర్), నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (నాగాలాండ్), సిక్కిం క్రాంతికారి మోర్చా, మిజో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఆఫ్ అస్సాం, ఇటీవల ఎన్డీఏ గూటికి వచ్చిన జేడీయూ, బిజు జనతా దళ్ (బీజేడీ), శివసేన (ఒక వర్గం ఎన్డీఏలో ఉంది), అకాలీదళ్ పార్టీలు ఉన్నాయి.
ఏకకాల ఎన్నికలను వ్యతిరేకించిన పార్టీలలో నాలుగు జాతీయ పార్టీలే కాక, డీఎంకే, ఏఐయూడీఎఫ్, టీఎంసీ, ఎంఐఎం, సీపీఐ, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మొదలైన ప్రధాన పార్టీలున్నాయి. వైసీపీ, టీడీపీ, బీఆర్‌ఎస్, ఐయుఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (ఎం), ఎన్సీపీ, ఆర్జెడీ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్పీ), ఆర్‌ఎల్డీ పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు.
ప్రాథమిక ఎన్నికల సూత్రాలకు వ్యతిరేకం: టీఎంసీ
2024 జనవరి 11న తన ప్రతి స్పందనన తెలిపిన టిఎంసి ”ఒక దేశం, ఒకే ఎన్నిక” రాజ్యాంగ, నిర్మాణపరమైన చిక్కులను ప్రశ్నించింది. రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి, ”ప్రాథమిక ఎన్నికల సూత్రాలకు” వ్యతిరేకంగా పేర్కొంది. రాష్ట్రాలను ముందస్తు ఎన్నికలకు బలవంతం చేయడం రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్ర సమస్యల అణిచివేతకు దారితీస్తుందని పేర్కొంది.
జాతీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి పార్టీలు పోటీ పడలేవు: ఎస్పీ
సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) జనవరి 11న తన స్పందనను పంపి, ఫిబ్రవరి 6న ప్యానెల్‌ను కలిసి అభిప్రాయాన్ని తెలిపింది. ఏకకాల ఎన్నికలు ప్రాంతీయ సమస్యలపై జాతీయ సమస్యలకు దారితీస్తాయని కూడా పేర్కొంది. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర స్థాయి పార్టీలు ఎన్నికల వ్యూహం, వ్యయంలో జాతీయ పార్టీలతో పోటీ పడలేవని పార్టీ పేర్కొంది.
ఎన్నికల ప్రజాస్వామ్యం బలహీనమైన పరిశీలనలకు లోబడి ఉండకూడదు: ఎంఐఎం
ఎంఐఎం 2024 జనవరి 15 లేఖలో, ఫిబ్రవరి 14న వ్యక్తిగతంగా తన స్పందనను తెలిపింది. అటువంటి ”ప్రాథమిక మార్పు”ను చేర్చడానికి రాజ్యాంగ అనుమతిని ప్రశ్నించింది. ఎన్నికలు కేవలం లాంఛనాలు కాదని, ఓటర్లను రబ్బరు స్టాంపులుగా పరిగణించరాదని పేర్కొంది. ఎన్నికల ప్రజాస్వామ్యం బలహీనమైన పరిశీలనలకు లోబడి ఉండకూడదని పేర్కొంది.
రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది : ఆప్
ఆప్ ఈ ఏడాది జనవరి 18న ప్యానెల్‌కు తన ప్రతి స్పందనను సమర్పించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న వ్యక్తిగతంగా పరస్పర చర్చ జరిగింది. దాని ప్రతిస్పందనగా, ఆప్ ఏకకాల ఎన్నికలు ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని, దేశ సమాఖ్య విధానాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. ”అవిశ్వాసం ఓటింగ్‌తో తొలగించబడని రాష్ట్రపతి పాలనను సంస్థాగతంగా మారుస్తుంది” అని పేర్కొంది.
సమాఖ్య నిర్మాణ స్ఫూర్తిని ఓడిస్తుంది : ఎన్సీపీ
నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్సీపీ) జనవరి 12 నాటి ఒక లేఖలో ఏకకాల ఎన్నికలు ”సమాఖ్య నిర్మాణ స్ఫూర్తిని నిరం తరం ఓడిస్తాయని పేర్కొంది. ”జాతీయ ఎజెండా ప్రాంతీయ, స్థానిక సమస్యలను కప్పివేస్తుంది” అని పేర్కొంది. ఇది ”రాజ్యాంగం సమగ్ర పరిశీలన”పై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.