1న పెన్షన్‌ విద్రోహదినం

1st is Pension Vidroha Day–  పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన : జాక్టో
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చేనెల ఒకటిన పెన్షన్‌ విద్రోహదినం పాటిస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పిలుపునిచ్చింది. పాఠశాల స్థాయిలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని కోరింది. ఈ మేరకు జాక్టో చైర్మెన్‌ జి సదానందంగౌడ్‌, సెక్రెటరీ జనరల్‌ ఎం రాధాకృష్ణ, కోశాధికారి కె కృష్ణుడు, నాయకులు దానయ్య సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెన్షన్‌ పొందడం ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగ హక్కని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలనీ, పీఆర్సీ కమిటీని వేయాలనీ, ఐఆర్‌ ప్రకటించాలనీ, కోర్టు కేసుల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు.

Spread the love