ఘోర రోడ్డు ప్రమాదం..21 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ ఆయిల్‌ ట్యాంకర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని గెరాష్క్‌ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ బస్సు ప్రయాణికులతో కాందహార్‌ నుంచి హెరత్‌ ప్రావిన్స్‌కు వెళుతోంది. ఈ క్రమంలో గెరాష్క్‌ జిల్లాలో జాతీయ రహదారిపైకి రాగానే బస్సును ఓ బైక్‌ ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరితో కలిపి మొత్తం 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 38 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ప్రావిన్స్‌ అధికారులు వెల్లడించారు.

Spread the love