నవతెలంగాణ- ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా లొంగిపోయాడు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ‘కర్తవ్య పథ్’ మార్గం గుండా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. లలిత్‌ను అరెస్టు చేసినట్టు నిర్ధారించాయి. న్యూఢిల్లీ జిల్లా పోలీసులు అతడిని స్పెషల్ సెల్‌కు అప్పగించారు. దీంతో రెండు రోజులపాటు పరారీలో ఉన్న ఈ లలిత్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. లలిత్ చివరిసారిగా కనిపించిన ప్రాంతం నీమ్రానా నుంచి బస్సులో ప్రయాణించి రాజస్థాన్‌లోని నాగౌర్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక హోటల్‌లో బస చేశాడని, పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారని తెలుసుకొని తిరిగి వచ్చి లొంగిపోయానంటూ లలిత్ తెలిపాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. లలిత్ ఝా కోల్‌కతా నగరానికి చెందిన వ్యక్తి. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని తేలింది. కాగా లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు అరెస్టయిన విషయం తెలిసిందే. లోక్‌సభలో కలకలం సృష్టించిన సాగర్ శర్మ, మనోరంజన్‌తోపాటు పార్లమెంట్ భవనం వెలుపల నినాదాలు చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు నలుగురు రంగుల పొగ డబ్బాలతో కలకలం రేపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాగర్, మనోరంజన్ లోక్‌సభ పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి తీవ్ర కలకలం రేపాయి. వీడియోలను రికార్డు చేశారు. ఈ వీడియోలను సూత్రధారి లలిత్ ఝా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
కాగా ఈ ఘటనలో నిందితులను ప్రశ్నించేందుకు కోర్టు 1 వారం సమయం ఇచ్చింది. 2 వారాలపాటు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోరగా ఒక వారం సమయం ఇచ్చింది. ఈ ఘటనలో తదుపరి విచారణ అవసరమని ఢిల్లీ పోలీసులు కోర్టుకు వివరించారు. కాగా.. నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా (యూఏపీఏ)తోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ ఏదీ లేదని దర్యాప్తు అధికారులు అనధికారికంగా చెబుతున్నట్టు తెలుస్తోంది.