30 శాతం ఇంక్రిమెంట్‌ అమలు చేయాలి

– నిలోఫర్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మొదటి పీఆర్సీ ప్రకారం 30 శాతం ఇంక్రిమెంట్‌ను తమకు అమలు చేయించాలని హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆస్పత్రి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్‌ నాయకత్వంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిలోఫర్‌లో 15 లక్షల పథకం పరిధిలో 2017లో అత్యవసర సేవల కోసం 74 మందిని పొరుగు సేవల ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు తీసుకున్నారని తెలిపారు. వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు థర్డ్‌ పార్టీ కింద తొలి పీఆర్సీ తర్వాత 10 నెలలు 30 శాతం ఇంక్రిమెంట్‌ అమలు చేశారని తెలిపారు. అప్పట్నుంచి థర్ట్‌ పార్టీ బాధ్యులను, ఆస్పత్రి పెద్దలను పదే పదే కోరుతున్నప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబం గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఇంక్రిమెంట్‌ కూడా అమలు చేయకపోవడంతో మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

Spread the love