రాఖీ పౌర్ణమికి మూడువేల ప్రత్యేక బస్సులు

– ప్రయివేటు బస్సుల్ని ఆశ్రయించి ఇబ్బందులు పడొద్దు : టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ అధికారుల్ని ఆదేశించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా మూడువేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
రోజూ వెయ్యి ప్రత్యేక బస్సులు నడపాలని దిశానిర్దేశం చేశారు. శనివారంనాడాయన రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సుల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఏ రూట్లలో ఎన్ని ప్రత్యేక బస్సులు నడపాలో చెప్పారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లాల నుంచీ అన్ని ప్రాంతాలకు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారనీ, ఆ ఒక్క రోజే సంస్థకు రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. ముందస్తు రిజర్వేషన్‌ కోసం షషష.్‌రత్‌ీషశీఅశ్రీఱఅవ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలనీ, మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నెంబర్లకు ఫోన్‌ చేయాలని చెప్పారు. సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు మునిశేఖర్‌, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్‌కుమార్‌, కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love