32 ఫామ్‌హౌస్‌లపై ఏక కాలంలో పోలీసుల దాడులు

– మొయినాబాద్‌, మేడ్చల్‌, శంషాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు
– 22 మంది అరెస్టు, పలు సామగ్రి స్వాధీనం
నవతెలంగాణ – శంషాబాద్‌
రంగారెడ్డి జిల్లా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏకకాలంలో 32 ఫామ్‌హౌస్‌లపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో నాలుగు ఫామ్‌హౌస్‌ల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో 22 మందిని అరెస్టు చేసి, పలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ పీఎస్‌ పరిధిలోని బిగ్‌బాస్‌ ఫామ్‌హౌస్‌, జహంగీర్‌ డ్రీమ్‌ వ్యాలీ ఫామ్‌ హౌస్‌, శంషాబాద్‌ పీఎస్‌ పరిధిలోని రిప్లెజ్‌ ఫామ్‌హౌస్‌, మేడ్చల్‌ పీఎస్‌ పరిధిలోని గోవర్ధన్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంపై సోమవారం దాడులు నిర్వహించారు. శంషాబాద్‌లో అక్రమంగా మద్యం, హుక్కా సేవిస్తున్నట్టు గుర్తించారు. మేడ్చల్‌లో బెట్టింగ్‌ ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. బిగ్‌బాస్‌ ఫామ్‌హౌస్‌ వాచ్‌మెన్‌ అబ్దుల్‌ మజీద్‌, ఉప్పల్‌కు చెందిన బి.స్వామిని అరెస్టు చేశారు. ఫామ్‌హౌస్‌ యజమాని పరారీలో ఉన్నాడు. జహంగీర్‌ డ్రెమ్‌ వ్యాలీ ఫామ్‌ హౌస్‌లో మంగళ్‌ హాట్‌కు చెందిన షేక్‌ సౌఫియాన్‌ ప్రయివేటు వర్క్‌ చేస్తున్న టోలిచౌకికి చెందిన ఇస్మాయిల్‌, ఎండీ నవాజ్‌, ఎండీ అఫ్రోజ్‌ అలీ, కాలా పత్తర్‌కు చెందిన సయ్యద్‌ సిద్ధిక్‌, బాలానగర్‌కు చెందిన సయ్యద్‌ రఫీ, బోయిన్‌పల్లికి చెందిన ఎండీ ఎజాజ్‌ అక్తర్‌ హుస్సేన్‌, బొరబండకు చెందిన ఎండీ నదీమ్‌, ఎండీ ఫ్రోజ్‌ ఖాన్‌, మల్లేపల్లికి చెందిన ఎం డీ ముస్తఫాను అరెస్టు చేశారు. ఇంటి యజమాని అజహర్‌ పరారీలో ఉన్నాడు. శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రిప్లెజ్‌ ఫార్మ్‌ హౌస్‌లో కాచిగూడకు చెందిన నిఖిల్‌, హైటెక్‌ సిటీకి చెందిన ఫామ్‌ హౌస్‌ యజమాని హేమంత్‌, సూపర్‌వైజర్‌ మహ్మద్‌ ఇంతియాజ్‌, ఘాన్సీమియా గూడకు చెందిన మేనేజర్‌ రాజు పట్టుబడ్డారు. మేడ్చల్‌ గోవర్ధన్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఫామ్‌హౌస్‌ యజమాని గోవర్ధన్‌ రెడ్డి, మీనాక్షి ఎంక్లేవ్‌ కండ్లకోయకు చెందిన పి.రాజేష్‌, కొంపల్లి బృందావన్‌ ఎంక్లెవ్‌కు చెందిన ఎం. మాధవ రెడ్డి, యంజాల్‌కు చెందిన టీ. శ్రీనివాస్‌, కండ్లకోయకు చెందిన ఎస్‌ .రవి, కౌకూర్‌కు చెందిన ఆర్‌. ప్రకాష్‌ రావు, షాపూర్‌నగర్‌కు చెందిన సాయి పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ. 1.03 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్లే కార్డులు 10 సెట్లు, సెల్‌ ఫోన్లు 7, హుక్కా కుండలు 10, హుక్కా పైపులు 5, హుక్కా బ్లూ బెర్రీ రుచులు 17, బొగ్గు 4, సిల్వర్‌ పేపర్‌ 3, ఫిల్టర్‌ ప్యాకెట్‌ – 1 ఎంఏ 19 బ్లెండర్‌ ప్రైడ్‌ – 1, కింగ్‌ ఫిషర్‌ లైట్‌ – 16, బ్రీజ్‌లు 5, ఇతర మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Spread the love