నిరంతర ప్రక్రియ.. ‘బీసీలకు రూ.లక్ష సాయం’

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి వీలుగా బీసీలకు రూ.లక్ష సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించిందనీ, అయితే అది ఒక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి గంగుల అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో మంత్రులు హరీష్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తగిన కృషి చేస్తున్నదని తెలిపారు. కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా రూ. లక్ష సాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. అందుకు సంబంధించి శనివారం వరకు 2,70,000 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని తెలిపారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తామని వెల్లడించారు. ప్రతి నెలా 5వతేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు ధృవీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు కేవలం ష్ట్ర్‌్‌జూర://్‌రశీbఎఎరbష. షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారాన్ని ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి సమర్పించాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు . లబ్దిదారుల అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. నెలలోపు లబ్దిదారులతో కూడిన యూనిట్ల ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. బీసీ సహాయం పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం క్యాబినెట్‌ సబ్‌ కమిటీకి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ అధికారులు పాల్గొన్నారు.

Spread the love