విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి

నవతెలంగాణ-ముషీరాబాద్‌
విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకష్ణ అధ్యక్షతన శనివారం విద్యార్థి సంఘాల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనీ, ఆ దిశగా విద్యార్థి సంఘం నాయకులు పని చేయాలనీ సూచించారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రా కార్పొరేట్‌ కాలేజీలను రాష్ట్రం నుంచి తరిమికొడతామని చెప్పిన సీఎం కేసీఆర్‌, రాష్ట్రం ఏర్పడ్డాక అదే కాలేజీల్లో ఫీజులు అధికమైనా పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యా వ్యవస్థను ఈ కళాశాలలు భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, విద్యా ప్రమాణాలను పాటించకుండా తల్లిదండ్రులను హింసిస్తున్నాయన్నారు. కార్పొరేట్‌ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్‌ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజు స్కీంను పున రుద్ధరించాలన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ తదితర కోర్సులకు కూడా పూర్తి ఫీజులు చెల్లించాలన్నారు. పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ ఎస్టీ, బీసీ కాలేజ్‌ హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలను పెంచాలని కోరారు. రాష్ట్రంలో కాలేజీలు, హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరారు. జూని యర్‌ అడ్వకేట్‌లకు ఇచ్చే స్టైఫండ్‌ నెలకు రూ.1000 నుంచి రూ.20వేలకు పెంచాలన్నారు. ఈ సమావేశంలో మాదిగ స్టూడెంట్‌ నాయకులు శాంతి కుమార్‌, బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు వేల్పుల సంజరు కుమార్‌, టీజేఎస్‌ నాయకులు కొత్తపల్లి తిరుపతి, అమ్‌ ఆద్మీ విద్యార్థి విభాగం నాయకులు పరిరక్షణ్‌ రాజ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయ కులు క్రాంతి, కుమార్‌ బీసీ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Spread the love