గత ఐదేండ్లలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి

నవతెలంగాణ హైదారాబాద్: విదేశాల్లో (Abroad) ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు (Indian Students )అనేక రకాల కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇలా అనేక కారణాలతో విద్యార్థులు మరణిస్తున్నారు. 2018 నుంచి 2023 వరకూ ఈ ఐదేండ్ల కాలంలో 400 మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం (Centre Goverment) తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడా (Canada)లోనే చోటుచేసుకున్నట్టు తెలిపింది.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ ( V Muraleedharan) రాజ్యసభ (Rajya Sabha)లో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. 2018 నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 34 దేశాల్లో 403 మంది భారతీయులు వివిధ కారణాలతో మరణించినట్టు చెప్పారు. మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం.. అత్యధికంగా కెనడాలోనే 91 మంది మృతి చెందారు. యూకేలో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20, సైప్రస్‌లో 14, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో 10 మంది చొప్పున విద్యార్థులు మృత్యువాతపడ్డారు.

Spread the love