నవతెలంగాణ హైదరాబాద్: ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌లకు కేర్ఆఫ్ అడ్రస్ గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో వరుస చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. ఒత్తిడి కారణంగా ఈ నెలలోనే ఏకంగా నలుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకోగా.. ఏడాదిలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోటాలోని అన్ని హాస్టళ్లు, పెయింగ్ గెస్ట్ వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు.
గతేడాది కోచింగ్ హబ్‌లో15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అన్ని హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కొంత మేరకు ఆత్మహత్యలు తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు.