చిన్నారుల అశ్లీల దృశ్యాలను వ్యాప్తిచేస్తున్న 47 అరెస్టు

– తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ 

నవతెలంగాణ హైదరాబాద్‌: చిన్నారుల అశ్లీల దృశ్యాలను వ్యాప్తి చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో 71 కేసులు నమోదు చేసి.. 47 మందిని అరెస్టు చేసినట్టు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా చిన్నారుల అశ్లీల దృశ్యాలకు సంబంధించి జరుగుతున్న కార్యకలాపాలను గమనించేందుకు ప్రత్యేకంగా తమ బ్యూరోలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (సీపీయూ)ను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.
నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ (సీపీఆర్‌పీ) నుంచి వచ్చే ఫిర్యాదులతోపాటు సీపీయూ ద్వారా తాము కూడా సైబర్‌ గస్తీ నిర్వహిస్తామని, అనుమానితులపై నిఘా ఉంచి ఆధారాలు సేకరిస్తామని, నేరం చేసినట్టు తేలితే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి కేసులు నమోదు చేయిస్తామని పేర్కొన్నారు. డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ (ఐసీపీ)తో కలిసి పనిచేసేలా రూపొందించిన సీపీయూను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించినట్టు పేర్కొన్నారు. చిన్నారుల అశ్లీల దృశ్యాల ప్రసారం వంటి అంశాలకు సంబంధించి ఎవరికి సమాచారం అందినా 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Spread the love