ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

Adilabadనవతెలంగాణ-మంచిర్యాల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద కండ్లకు నల్ల రిబ్బన్స్‌తో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 60శాతం బీసీ జనాభా ఉంటే కేంద్రంలో బీసీ ఉద్యోగులు 16శాతం మాత్రమే ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు 54 లక్షలు కాగా బీసీ ఉద్యోగులు 4.62లక్షలు మాత్రమే ఉన్నారన్నారు. ఇది బీసీలపై వివక్ష చూపించడమే అని అన్నారు. రాష్ట్ర జనాభాలో 56శాతం బీసీలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు కేవలం తొమ్మిది శాతం మాత్రమే రిజర్వేషన్‌ ఉందన్నారు. మండల కమిషన్‌ బీసీల ఉద్యోగాలలో 27శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నివేదిక ఇస్తే, 40 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 76 సంవత్సరాలుగా బీసీలకు ఉద్యోగాలలో అన్యాయం చేస్తున్నారని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజులలో నిరుద్యోగ బీసీ యువత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గుమ్ముల శ్రీనివాస్‌, భీమ్‌సీన్‌, రాములు, రాజేశం, భిక్షపతి, అంకం సతీష్‌, చంద్రమౌళి, రాజన్న పాల్గొన్నారు.

Spread the love