బురదలో చిక్కుకున్న 70 వేల మంది


నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు హాజరైన 70 వేల మంది బురదలో చిక్కుకుపోయారు. నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో ఆగస్టు 27న ఈ ఫెస్టివల్ మొదలైంది. ఆ తర్వాతి రోజు రాత్రంతా భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా బురదగా మారింది. మూడు నెలల్లో కురవాల్సిన వర్షం మొత్తం ఒక్క రాత్రిలోనే కురవడంతో ఆ ప్రాంతం బురదతో నిండిపోయింది. దీంతో చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. మరోవైపు, వర్షం కారణంగా ఆ ప్రాంతమంతా బురదమయంగా మారడంతో ఫెస్టివల్‌కు హాజరైన 70 వేలమంది అందులో చిక్కుకుపోయారు. వాహనాలు బురదలో చిక్కుకుని మొరాయిస్తున్నాయి. కాళ్లు కిందపెడితే కూరుకుపోతున్నాయి. చుట్టూ కొన్ని మైళ్ల దూరం వరకు ఎటుచూసినా బురదే కనిపిస్తోంది. లోపలున్న వారు బయటకు రావడానికి, బయట ఉన్నవారు లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీంతో బ్లాక్‌రాక్ సిటీని మూసివేసినట్టు అధికారులు తెలిపారు. భూ ఉపరితలం ఎండే వరకు వాహనాలను అనుమతించబోమని నిర్వాహకులు పేర్కొన్నారు. సందర్శకులు ఆహారం, నీరు వాడుకుని పొడిగా, వెచ్చగా ఉండే ప్రదేశం కనిపిస్తే తలదాచుకోవాలని సూచించారు.

Spread the love