నేడు భారత్‌- పాకిస్థాన్‌ వన్డే మ్యాచ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడుతున్న భారత్‌, పాకిస్థాన్‌ మధ్య చాన్నాళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారి తలపడ్డ ఈ రెండు జట్లు.. శనివారం ఆసియాకప్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆ వరల్డ్‌కప్‌ తర్వాత కూడా భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌లు జరిగినా.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఇదే మొదటిది. ఆసియాకప్‌ తొలి పోరులో నేపాల్‌ను చిత్తుచేసిన పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు రోజే తుది జట్టును ప్రకటించి ఉత్సహంగా ఉంటే.. దాయాదిని దెబ్బకొట్టాలని టీమ్‌ఇండియా భావిస్తున్నది. ఒకప్పుడు భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే.. వాళ్ల బౌలింగ్‌కు మన బ్యాటింగ్‌ మధ్య సమరంగా అభివర్ణించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పేస్‌ విభాగంలో టీమ్‌ఇండియా కూడా బలంగా మారితే.. పాక్‌ బ్యాటింగ్‌లో ఎంతో మెరుగైంది. ఇటీవలి కాలంలో ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆ జట్టు నిలకడగా విజయాలు సాధిస్తున్నది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే అంత ఆషామాషీ కాదని ఇప్పటికే రోహిత్‌ పేర్కొనగా.. భారత మాజీలు మాత్రం మొగ్గు మనవైపే ఉందని అంటున్నారు. తొలి స్పెల్‌తోనే ముప్పు షాహీన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, హరీస్‌ రవుఫ్‌తో కూడిన పాక్‌ పేస్‌ త్రయాన్ని టీమ్‌ఇండియా టాపార్డర్‌ ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే ఈ మ్యాచ్‌లో భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా పాక్‌ బౌలర్లు తొలి స్పెల్‌లో విజృంభించడం ఖాయం కాగా.. దాన్ని మనవాళ్లు కాచుకోగలిగితే ఆ తర్వాత పెద్ద కష్టం కాకపోవచ్చు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ బౌలర్లను ఊచకోత కోసిన స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి కీలకం కానుండగా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ తమ వికెట్‌ విలువ గుర్తెరిగి ఆడాల్సి ఉంది. నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ బరిలోకి దిగడం ఖాయమే. హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాతో మిడిలార్డర్‌ బలంగానే కనిపిస్తున్నది. బుమ్రా, షమీ, సిరాజ్‌ పేస్‌ భారం మోయనున్నారు. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌ జట్టు నిలకడగా రాణిస్తోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరింత బలంగా ఉంది. వాతావరణం మేఘావృతమై ఉండనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.
జట్లు భారత్‌ (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌, ఇషాన్‌, పాండ్యా, జడేజా, కుల్దీప్‌, బుమ్రా, షమీ, సిరాజ్‌.
పాకిస్థాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), షాదాబ్‌, ఫఖర్‌, ఇమామ్‌, సల్మాన్‌, ఇఫ్తిఖార్‌, రిజ్వాన్‌, నవాజ్‌, నసీమ్‌, షాహీన్‌, రవుఫ్‌.

Spread the love