డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

నవతెలంగాణ- హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాదాపూర్‌లోని ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌లో టీఎస్ న్యాబ్ పోలీసులు భగ్నం చేసిన రేవ్‌పార్టీకి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులు కాపా భాస్కర్ బాలాజీ (34), కారుమూరి వెంకటరత్నారెడ్డి (48), మురళి (43) రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న విషయాలు విస్మయం గొల్పుతున్నాయి. సినిమాల్లో అవకాశాల పేరుతో అమ్మాయిలు, రేవ్‌పార్టీలతో ప్రముఖులకు ఎరవేసి డ్రగ్స్ దందా సాగిస్తున్నట్టు బయటపడింది. వీరి వద్ద పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని నిందితులుగా చేర్చగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ముందు జాగ్రత్త చర్యగా నిందితులు ‘నిక్ నేమ్స్’తో దందా సాగిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఏ2 కారుమూరి వెంకటరత్నారెడ్డిది గుంటూరులోని నెహ్రూనగర్. డీఆర్ఐ అధికారిగా చెప్పుకుంటూ నిర్మాతలతో విమాన టికెట్లు, హోటల్ బిల్లు కట్టించాడు. పెళ్లిళ్ల పేరుతో ప్రవాసాంధ్రులను మోసం చేశాడు. అతడి దాదాపు 25కుపైగా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పలు కేసుల్లో అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత నిర్మాతగా నమ్మిస్తూ సినీ అవకాశాల పేరుతో యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నాడు. మైనర్లను హైదరాబాద్ రప్పించి రేవ్‌పార్టీలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Spread the love