రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు..

నవతెలంగాణ-హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు పట్టుబడగా, పాతబస్తీలో 14 కేజీల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌లోని మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో తోల్‌కట్టా వద్ద ఓ షెడ్డుపై పోలీసులు దాడిచేశారు. అక్రమంగా చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని సౌరబ్‌ ఖాన్‌గా గుర్తించారు. అతనితోపాటు ముస్తబా అలీఖాన్‌, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 92 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, పాతబస్తీలోని ఉప్పుగూడలో రూ.5 లక్షల విలువైన 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. వారి వద్ద గంజాయి, ఓ కారు, రెండు బైక్‌లతోపాటు 2 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి విద్యార్థులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితులు శరీష, పద్మతోపాటు శ్రీనివాస్ చారీపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Spread the love