– మొజాంబిక్ సముద్రంలోపడవ మునకతో విషాదం
మొజాంబిక్ (ఆఫ్రికా) : కలరా భయంతో ప్రధాన భూభాగాన్ని వీడేందుకు పడవలో బయల్దేరిన 94 మంది ఆ పడవ సముద్రంలో మునిగిపోవడంతో మరణించిన విషాద ఘటన ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో జరిగింది. మరో 26 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంత సుముద్రంలో మత్స్యకార పడవ మునిగిపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారని చెప్పారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను పడవలో ఎక్కించుకోవడంతో ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో 94 మంది ప్రాణాలు కోల్పోయారని నంపులా ప్రావిన్స్‌కు సంబంధించిన స్టేట్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. సహాయక సిబ్బంది ఐదుగురిని ప్రాణాలతో రక్షించారని, మిగతా వారి కోసం గాలిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో అత్యంత పేదదేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో అక్టోబర్ నుంచి దాదాపు 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. 32 మరణాలు సంభవించాయి. ఎక్కువగా నంపులా ఫ్రావిన్స్ ప్రభావితమైంది. పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.