– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవోను వెంటనే మార్పు చేసి కొత్త జీవోను తీసుకురావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్‌లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడి అత్యధిక మంది వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారని, రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెరగటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న 2012 లో విడుదల చేసిన జీవో 79 అమలవుతుందని నేటికీ వేతనాలు సవరించి కొత్త జీవోను విడుదల చేయలేదని, దీని మూలంగా వ్యవసాయ కార్మికులపై ధరల భారం రోజురోజుకు పెరుగుతుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం కింద రూ.18 వేల రూపాయల కన్నా తక్కువ ఇవ్వకూడదని తీర్పు వెల్లడించిందని గుర్తు చేశారు. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు రోజు కూలి రూ.600 ఇవ్వాలని,పెంచిన వ్యవసాయ కార్మికుల వేతనాలను అమలు జరిగేలా, రెవిన్యూ సిబ్బంది ద్వారా గ్రామసభలు నిర్వహించి పెరిగిన కూలి రేట్ల విషయాలను తెలియజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ కార్మికులకు కూలి రేట్ల పెంపుకై తక్షణమే జీవో విడుదల చేసి వ్యవసాయ కార్మికులని ఆదుకోవాలని కోరారు. అనంతరం నల్లగొండ తహసీల్దార్‌కు కూలిరేట్ల జీవో సవరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి దండం పల్లి సరోజా, పట్టణ అధ్యక్షుడు రుద్రాక్ష యాదయ్య, సంఘం నాయకులు గోలి నరసింహ, కట్ట అంజయ్య, వడ్డే ధనమ్మ, రేపాక యాదగిరి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.