బతుకు దెరువు కోసం వచ్చి ..కాలువలో పడి శవమై

నవతెలంగాణ-పెద్దవూర
బతుకు దెరువు కోసం వచ్చి కాలువలోపడి శవమై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం, పెద్దపాలెం గ్రామానికి చెందిన షేక్‌ లాల్‌ సాహెబ్‌ (50) గత రెండు నెలల క్రితం తన భార్య పిల్లలతో కలిసి పెద్దవూర సమీపంలోని నాయినవాని కుంట స్టేజి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ పట్టాలను ధాన్యం తడవకుండా వేసే కవర్‌లు కిరాయికి ఇచ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం తన యూనికార్న్‌ మోటార్‌ సైకిల్‌ పై నిడమానూరు మండలంలోని పార్వతీపురంకు వెళ్లాడు. అక్కడ పని చూసుకొని, ఒక ఇనుప మంచంను తన బండి పై తీసుకొని పెద్దవూరకు రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా బట్టుగూడెం గ్రామాపంచాయితి పరిధిలోని కొత్తగూడెం గ్రామం శివారులోకి వచ్చేసరికి అతని బండి అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రక్కన గల కాలువలో బండి మంచంతో పాటు పడి పోయాడు. దీంతో బలమయిన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ద్రాక్షబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పరమేష తెలిపారు.

Spread the love