నవతెలంగాణ- మోత్కూరు: ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… పాలడుగు గ్రామానికి చెందిన గుంటోజు నర్సింహాచారి, ఉమారాణి దంపతులకు ఉదయ్, సాయి ఇద్దరు కుమారులు ఉదయ్ తండ్రి నర్సింహాచారి మూడేళ్ల క్రితం మృతి చెందగా తల్లీకుమారులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. ఉదయ్ నాచారంలో కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. కాగా ఉదయ్ తండ్రి తద్దినం, గ్రామంలో బోనాల పండుగ కావడంతో రెండు రోజుల క్రితం వారంతా పాలడుగు వచ్చారు. తండ్రి తద్దినం పూర్తి చేసి ఆదివారం గ్రామంలో బోనాల పండుగ కావడంతో తల్లి ఉమారాణి బోనం ఎత్తుకుని చిన్న కుమారుడు సాయిని తీసుకుని గుడి వద్దకు వెళ్లింది. ఇంటి వద్దే ఉన్న ఉదయ్ (24) వారు వెళ్లిపోగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియడం లేదు. మూడేళ్ల క్రితం భర్త మృతి చెందడం, ఇప్పుడు కొడుకు ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి ఉమారాణి, తమ్ముడు సాయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మోత్కూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి శవాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.