బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన..

– జిల్లాలో సిట్టింగ్ లకే టిక్కెట్లు కేటాయించిన సియం కేసీఆర్,

– సూర్యాపేట జగదీష్ రెడ్డి, తుంగతుర్తి గాదరి కిషోర్, కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ సైదిరెడ్డి, నిరాశలో టిక్కెట్లు ఆశించినవారు.
 నవతెలంగాణ-సూర్యాపేట
 అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం హైద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఆయన మొదటి నుండి చెప్తున్న విధంగానే సిట్టింగ్ లకే టికెట్లు ఇచ్చారు.పలు రకాల సర్వేల ద్వారా చేపట్టిన  అభిప్రాయ సేకరణ మేరకే టికెట్లు ఫైనల్ చేసినట్లు కేసీఆర్ మీడియాతో పేర్కొన్నారు. ఈ క్రమంలో సూర్యాపేట అసెంబ్లీ టిక్కెట్ ను  మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డికి కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కె దక్కింది. ఇంకా కోదాడకు బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి శానంపూడి సైదిరెడ్డి ల పేర్లను కేసీఆర్ ప్రకటించారు.ఈ క్రమంలో మొదటి నుండి కోదాడ అసెంబ్లీ టికెట్ మారుతుందనే ప్రచారం జోరుగా సాగింది.  కోదాడలో నియోజకవర్గ ఇన్చార్జి శశిధర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు లు  టికెట్ను  ఆశించారు.బొల్లం మల్లయ్య కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేక గళం విప్పారు.నియోజకవర్గంలో ఎమ్మెల్యే కు యాంటీ గా పలు కార్యక్రమాలు నిర్వహించి మల్లయ్య ను ఉక్కిరిబిక్కిరి చేశారు.ఇదిగాక జెడ్పీ చైర్మన్ దీపికా భర్త గుజ్జ యుగేoదర్ రావు కూడా ఇక్కడి నుండి టిక్కెట్ ఆశించారు.ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయిన ఆయన ఆశలు ఆడియశాలు అయ్యాయి. అదేవిధంగా ఎన్.ఆర్.ఐ సుదీర్ కూడా టిక్కెట్ తనదే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు.సర్వేలో తన పేరే ఉందంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.ఎవరెన్ని ఎత్తుగడలు వేసిన చివరికి సియం కేసీఆర్ మాత్రం బొల్లం మల్లయ్య కె టిక్కెట్ కేటాయించారు.ఈ క్రమంలో  నియోజకవర్గo లో నెలకొన్న వర్గ విభేదాలను బొల్లం ఎలా రాజీ చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామని మొదటి నుంచి చెప్పిన విధంగానే  కేసీఆర్ జిల్లాలో   సిట్టింగ్ లేక్ టికెట్లు కేటాయించి  తన మాట నిలుపుకున్నారు. కాగా టికెట్ల ప్రకటనతో ఇప్పటివరకు ఉన్న  అంతర్గతంగా రగులుతున్న  అసమ్మతి  పోరు, వర్గ విభేదాలు భగ్గుమనే అవకాశాలున్నాయి. టికెట్  ఆశించిన వారు కూడా కొత్త కుంపట్లు పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా టికెట్ల ప్రకటనతో కేసీఆర్ దూకుడు  ప్రదర్శించి ఎన్నికల భేరీ మోగించారు.
Spread the love