– టీపీఎస్కే గౌరవాధ్యక్షులు జి రాములు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘కర్మ సిద్ధాంతం’పై కలం అనే కత్తి దూసిన యోధుడు గుర్రం జాషువా అని టీపీఎస్కే గౌరవాధ్యక్షులు జి రాములు అన్నారు. మూఢవిశ్వాసాల్లేకుండా శాస్త్రీయ ఆలోచనలు కలిగిన ఉన్నారని చెప్పారు. జాషువా 128వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘నవ సమాజ నిర్మాణం’అనే అంశంపైన జి రాములు మాట్లాడుతూ నాలుగు పడగల హైందవ నాగరాజు విష సంస్కృతిపై నిప్పులు చెరిగిన మహాకవి జాషువా అని చెప్పారు. అణగారిన వర్గాల హక్కులపై దండోరా వేసిన నవయుగ వైతాళికుడని కొనియాడారు. జాషువా మనుధర్మ వ్యతిరేక సామ్యవాద ఉద్యమాలకు సాక్షి భూతంగా జీవితాంతం నిలబడ్డాడని అన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీసిన విప్లవ మూర్తి జాషువా అని చెప్పారు. టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పంచమ కులం ఎక్కడిదని ప్రశ్నించిన ప్రగతికవి జాషువా అని అన్నారు. వర్గకుల వివక్ష లేని సమాజం కావాలని నినదించినాడని చెప్పారు. ఆకలి దరిద్రం లేని జీవితం కావాలని కోరాడన్నారు. జాషువా ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, టీపీఎస్కే నాయకులు జి నరేష్, ఎం సురేష్ తదితరలు పాల్గొన్నారు.