– బాయికాడ మోటర్లు పెట్టాలని బెదిరించిన బెదరలేదు
– రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత పెట్టారు
– ప్రశాంత్ రెడ్డి నా కొడుకులాంటి వాడు
– ఇప్పటిలాగానే మళ్లీ పెద్దమనిషిగా ఉంటాడు
– పెద్దమనిషిగా ఉంటే బాల్కొండ కూడా పెద్దవుతుంది
– ప్రశాంత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించండి
– బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ- కమ్మర్ పల్లి:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందని ముఖ్యమంత్రి కేసిఆర్ విమర్శించారు. సంస్కరణల పేరుతో కేంద్రం అన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ, ప్రధాని మోడీ తన ఆప్తులకు అందిస్తున్నారన్నారు. బాయికాడ మీటర్లు పెట్టాలని… తనపై ఒత్తిడి తెచ్చి బెదిరించిన, తాను తలోగ్గలేదని స్పష్టం చేశారు. బాయికాడ మోటర్లు పెట్టకపోవడంతో రాష్ట్రంపై కక్షగట్టి రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధుల్లో కోతపెట్టారన్నారు. సంవత్సరానికి రూ.5వేల కోట్ల చొప్పున గడిచిన ఐదు సంవత్సరాలలో రూ.25 వేల కోట్ల నష్టం రాష్ట్రానికి వాటిల్లిందన్నారు. అయినప్పటికీ రైతుల శ్రేయస్సు కోసం మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రశాంత్ రెడ్డి నా కొడుకులాంటి వాడు.. ఇప్పటిలాగానే మళ్లీ పెద్దమనిషిగా ఉంటాడు…పెద్దమనిషిగా ఉంటే బాల్కొండ కూడా పెద్దవుతుందని, ప్రశాంత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
గురువారం వేల్పూర్ లోని స్పైసిస్ పార్కులో జరిగిన బాల్కొండ నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.నరేంద్ర మోదీకీ పిచ్చి లేచిందని, ప్రైవేటీకరణ పిచ్చి అన్నారు. రైళ్లు ప్రైవేటు, విమానాలు ప్రైవేటు, ఓడ రేవులు ప్రైవేటు చేయడంతో పాటు కరెంటు కూడా ప్రైవేటు చేసిండన్నారు. నన్ను బెదిరించి నరేంద్రమోడి మోటార్లకు మీటర్లు పెట్టుమన్నారని సభలో ప్రజలకు తెలిపారు. పెట్టను ఏం చేసుకుంటావో చేసుకోమని తెలిపినట్లు వివరించారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి రూ.5 వేల కోట్ల కోత విధిస్తామన్నారని, అయిన ఒప్పుకోకపోతే ఐదేండ్లకు రూ. 25వేల కోట్ల నిధుల కోతలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎవడో వచ్చి ఏదో మాట్లాడతారన్నారు.
సాయి సంసారి, లచ్చి దొంగ అనొచ్చు అని సామెత చెప్పారు.నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలువడమే కాదు, వీళ్ల గెలుపుతోనే రాష్ట్రంలో పార్టీ గెలుస్తుంది అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ఎన్నికల్లో నిలబడ్డా, ఏ పార్టీ చరిత్ర ఏంటో, ఏ పార్టీ ప్రజలకు ప్రయోజనం కలిగించిందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నడని ఆలోచించాలని, వారి గుణగణాలపై, ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు చర్చ చేయాలన్నారు. ఇతర దేశాల్లో ఇంత పెద్ద ఎత్తున భారీ సభలు ఉండవని, అక్కడి నాయకులు టీవీల్లో మాత్రమే మాట్లాడతారన్నారు.ఓటు అనేది మన కిస్మత్ ను నిర్ణయించేదని, వజ్రాయుధమే ఓటు అన్నారు. దానిని దుర్వినియోగం చేసుకుంటే తలరాతనే మారుస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ఓటు ద్వారా నాయకులు కాదు… ప్రజలు గెలుస్తారని, ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏకబిగిన 50 ఏళ్లు పాలించిందని, ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని.. ఒక్క చాన్స్ ఇస్తే పంటికి అందకుండా మింగుతరా? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు? ప్రశాంత్ రెడ్డి కన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు బాల్కొండలో ఉండేవారని, అప్పుడు ఏం జరిగింది… ప్రశాంత్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో చర్చించాలని ప్రజలను కోరారు. ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో 18 సబ్ స్టేషన్లు నిర్మించాడని, 40 కి పైగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాడన్నారు. తెల్లం దాకా..పొద్దాక కరెంటు ఇచ్చే కాంగ్రెస్ రాజ్యం రావాలా? 24 గంటలు కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? సభలో ప్రజలను ప్రశ్నించారు. సబకాజరైన ప్రజలు 24 గంటల విద్యుత్ కావాలని చేతులెత్తి నినాదించారు.ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా 24 గంటలు కరెంటు లేదన్నారు.నీళ్లు ఫ్రీ ఇస్తున్నాం… కరెంటు 2 గంటలు ఫ్రీగా ఇస్తున్నాం, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం… రైతుల పంటలు కొంటున్నామన్నారు. జుక్కల్ ప్రాంతంలో వద్దయ్య అంటే పచ్చ జొన్నలు పండిస్తున్నారని, వాటిని వెయ్యికి రెండు వేలకు కూడా కొనారని రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనడం ద్వారా వచ్చిన నష్టాన్ని కూడా ప్రభుత్వం భరిస్తున్నదని తెలిపారు. ధాన్యం కొంటే 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు పడిపోతున్నాయని, దళారులు లేరు, మధ్యలో ఎవరూ లేరన్నారు.రైతు బీమా కూడా ఎవరూ పైరవీ లేకుండా రూ.5 లక్షల వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆపద్భందు ఉండేదని,రూ50 వేలు అందించేవారని, అందులో రూ.30 వేలు దళారులు తినేవారన్నారు. కేవలం 20 వేలు మాత్రమే ఇచ్చేవారని కానీ ఇప్పుడు రూ.5 లక్షలు వస్తున్నాయన్నారు.కాంగ్రెస్ చేతిలో ప్రభుత్వం ఉంటే ఎరువులు దొరకలేదు.. కరెంటు దొరకలేదు… సాగునీరు లేదన్నారు. రైతుబంధు కోసం తనకు ఎవరు దరఖాస్తు పెట్టలేదని, ధర్నాలు చేయలేదన్నారు.సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్ల ధాన్యం పండించి దేశంలో నెంబర్ వన్ గా తెలంగాణ నిలుస్తుందన్నారు.మంది మాటలు పట్టుకుని మార్వానం పోతే… ఇంటికి వచ్చే వరకు ఇళ్లు కాలిపోయిందన్నట్లు కాంగ్రెస్ కు ఓటేస్తే ఉంటుందన్నారు.భగీరథ బ్రహ్మాండగా విజయవంతం చేసుకున్నామన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు.17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నప్పటికీ ఏ ఒక్క రాష్ట్రం కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఆర్థిక పరిస్థితి పెరిగిన కొద్దీ పెన్షన్ పెంచుకుంటూ పోయినామని, రాబోయే రోజుల్లో 5వేల పెన్షన్ రాబోతుందని తెలిపారు. పెన్షన్ దారుల ఒక్క ఓటు కూడా పోవద్దని, బీఆర్ఎస్ కు ఓటేయ్యాలని కోరారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటుబ్యాంకుగా వాడుకున్నారన్నారు. దళితులను అంటరానితనంగా చూశారని, వెలివాడల్లో నివసించేలా చూశారని, కాంగ్రెస్ వారి వల్లే దళితులకు నష్టం జరిగిందన్నారు.దళితబంధు నా మానస పుత్రిక అని పేర్కొన్న ముఖ్యమంత్రి అందరికి దళితబంధు అందేలా చూస్తామన్నారు.చేనేత కార్మికులు, గీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు బీమా అడుగుతున్నారని, అందుకే 93 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నవారందరికీ బీమా తీసుకు వస్తున్నట్లు తెలిపారు.తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని, తెలంగాణ రాకముందు 17 స్థానంలో ఉన్నామన్నారు.10 ఏండ్లు తిప్పల పడ్డా ఫలితాలు మీ ముందున్నాయని తీర్పు చెప్పాల్సింది ప్రజలేనన్నారు.రైతుబంధు ఉండాల్నా లేదా అని అడిగితే ప్రజలందరూ కావాలని డిమాండ్ చేశారు. 24 గంటల ఉచిత కరెంటు ఉండాలా అని ప్రజలను అడిగితే ఉండాలని సభలో డిమాండ్ చేశారు. మనుషులు మాట్లాడితే కొంత ఇజ్జత్ కూడా ఉండాలని, కేసీఆర్ కర్ణాటకను చూడటానికి రా… బస్సు పెడతానని కర్ణాటక నుంచి వచ్చిన అక్కడి ఉప ముఖ్యమంత్రి అంటున్నాడన్నారు. మేము ఐదు గంటల కరెంటు ఇస్తున్నాం. చూడాలంట. మన దగ్గరే 24 గంటలు కరెంటు ఇస్తున్నప్పుడు వాడు ఇచ్చే 5 గంటలు చూడటానికి వెళ్లాలంట అని ఎద్దేవ చేశారు. బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి ఏదో చెప్పిపోతాడు, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఇక్కడికి బ్రతుకడానికి వస్తున్నారు. వీళ్ల మాటలు చూసి రాయి పట్టుకుని తలపగుల కొట్టుకోవాలా? అని ప్రశ్నించారు. మీరు కొట్లాడాలి… నేను ఉద్యమం చేసినా.. తెలంగాణ కోసం పోరాటం చేసినా తెలంగాణ సాధించినా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మోతె గ్రామానికి ప్రత్యేక స్థానం…..
తెలంగాణ ఉద్యమంలో వేల్పూర్ మండలంలోని మోతే గ్రామానికి ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా మోతె గ్రామం జ్ఞాపకం వస్తుందన్నారు. మూతి మట్టిలో బలం ఉందని, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం మోతె గ్రామం మొదట తీర్మాణం చేసిందని గుర్తు చేశారు. మోతే మట్టిని ముడుపు కట్టుకుని హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని, తెలంగాణ వచ్చినాక మళ్లీ ఇక్కడికి తెచ్చి మోతెలో అదే మట్టిని కలిపినట్లు తెలిపారు.
ప్రశాంత్ నా కొడుకులాంటి వాడు……
ప్రశాంత్ రెడ్డి నా కొడుకులాంటి వాడు… ఇప్పటిలాగానే మళ్లీ పెద్దమనిషిగా ఉంటాడు. పెద్దమనిషిగా ఉంటే బాల్కొండ కూడా పెద్దవుతుందని ప్రజలు గ్రహించాలన్నారు.ప్రశాంత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని, కారు గుర్తుకే ఓటెయ్యాలని కోరారు.సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, మాజీ ఎమ్మెల్సీలు బిజీ గౌడ్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, మహారాష్ట్ర రైతు రఘునాథ దాదా, తదితరులు పాల్గొన్నారు.