మారణకాండకు అమెరికా అండ!

America is ready for the carnage!ప్రపంచంలో శాంతిని కాపాడేందుకు, మారణ కాండలను నివారించేందుకు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్య సమితి వైఫల్యం మరోసారి వెల్లడైంది. ఆత్మరక్షణ పేరుతో గాజాలో సాధారణ పౌరుల మీద వైమానిక, టాంకులతో ఇజ్రా యెల్‌ సాగిస్తున్న హత్యాకాండ నివారణను అడ్డుకొనే వారే లేరా? ప్రతి రోజూ పిల్లలు, మహిళలతో సహా వందలాది మందిని చంపివేయటాన్ని ఆపాలని భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా ఇప్పటికే వీటో చేసి మరోసారి తానేమిటో ప్రపంచానికి వెల్లడించింది. ఐరాస చేసిన తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనాను అడ్డుకోవటమే గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న అణచివేత-ప్రతిఘటనకు మూలం. దీనిపై భద్రతా మండలి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతి నెలకొనేందుకు, పాలస్తీనాకు మద్దతుగా ప్రవేశపెట్టిన 34 తీర్మానాలను అమెరికా వీటో చేసింది. యూదు దురహం కారులను సమర్ధిస్తూ ప్రవేశపెట్టిన మరో రెండింటిని రష్యా, చైనా అడ్డుకున్నాయి.లెబనాన్‌పై దాడి, సిరియా గోలన్‌ గుట్టలను ఆక్రమించుకోవటంతో సహా ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉన్న మొత్తం 46 తీర్మానాలను అమెరికా అడ్డుకున్నది. దుర్మార్గం ఏమంటే జెరూసలెం నగరాన్ని తటస్థంగా ఉంచుతూ ఐరాస చేసిన నిర్ణయాన్ని ఉల్లం ఘించి ఆక్రమించుకొని తమ రాజధాని అని ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. దాన్ని అమెరికా 2017లో గుర్తించింది. ఐరాస తీర్మానాలకు అనుగుణంగా దాని భవిష్యత్‌ నిర్ణయం జరగాలని భద్రతా మండలిలో 14దేశాలు ఓటు వేస్తే అమెరికా వీటో చేసింది. పాలస్తీనా ప్రాంతాల్లో మారణ కాండకు పాల్పడుతున్నది ఇజ్రాయెల్‌ మిలిటరీ, ఉగ్ర వాదులు అయినప్పటికీ వారిని వెనుక ఉండి నడిపిస్తున్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు గనుక అక్కడ చిందే ప్రతి రక్తపు బొట్టుకూ బాధ్యత నుంచి తప్పించుకోలేవు.
గతం, వర్తమాన పరిణామాలను చూస్తున్నపుడు ఐరాసను ఒక ప్రజాస్వామిక సంస్థగా మార్చేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమన్నది స్పష్టం. లక్ష మంది జనాభా ఉన్న కరీబియన్‌ ప్రాంత దేశమైన సెయింట్‌ విన్సెంట్‌, నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారత, చైనాలు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఒక్కో ఓటును మాత్రమే కలిగి ఉంటాయి. అది ప్రజాస్వామ్యబద్దమే అయినప్పటికీ అక్కడ చేసే తీర్మానాలకు ఎలాంటి విలువా ఉండదు. పదిహేను మంది ప్రతినిధులు ఉండే భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానాన్ని 14 మంది ఆమోదించినా ఐదు శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్కటి కాదన్నా దానికీ అదే గతి పట్టటం పెద్దలోపం. ఇజ్రాయెల్‌ దుర్మార్గం, క్యూబాపై అమెరికా అమలు జరుపుతున్న అష్టదిగ్బంధనాన్ని ఖండిస్తూ ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తున్నా జరుగుతున్నదేమీ లేదు. గాజాలో జరుపుతున్న దాడులను మానవతా పూర్వకంగా నిలిపివేయాలని సాధారణ అసెంబ్లీలో 121 దేశాలు అనుకూలంగా, 14 వ్యతిరేకంగా ఓటుచేయగా మనతో సహా 44 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన నాలుగు తీర్మానాలను అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ దాడులు చేసే హక్కుందని అమెరికా తెచ్చిన తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకున్నాయి.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన నానాజాతి సమితిలో భద్రతా మండలి మాదిరి వ్యవస్థలో ఉన్న 15 సభ్యదేశాలకూ వీటో హక్కు ఉండటంతో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేక అది ఘోరంగా విఫలం కావటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా అడ్డుకోలేకపోయింది.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత విజేతలుగా ఉన్న దేశాల ప్రమేయంతో ఏర్పడిందే ఐరాస. 1945లో అది ఉనికిలోకి వచ్చినపుడు అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్సులకు వీటో హక్కు కల్పించారు. తొలి రోజుల్లో ఐరాస సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలిలో అమెరికా, పశ్చిమ దేశాల అనుకూలురే ఎక్కువ. దాంతో వారికి అనుకూలమైన తీర్మా నాలను సోవియట్‌ అడ్డుకుంది.
2022 మే నెల వరకు సోవియట్‌, తరువాత దాని వారసురాలిగా ఉన్న రష్యా 121సార్లు, అమెరికా 82, బ్రిటన్‌ 29, చైనా 17, ఫ్రాన్సు 16సార్లు వీటోను ప్రయో గించాయి. వీటో హక్కు ప్రజా స్వామ్యబద్దం కాదన్నది నిజమే అయినప్పటికీ అది లేకపోతే తొలి రోజుల్లో తమ కూటమికి ఉన్న బలంతో మొత్తం ప్రపంచాన్ని అమెరికా తనపెత్తనం కిందకు తెచ్చుకొని ఉండేది. ఇప్పుడు మెజారిటీ దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నందున ప్రజాస్వామిక అభిప్రాయాన్ని అడ్డు కొనేం దుకు వీటోను ఆయుధంగా చేసు కుంటోంది. అందుకే పైకి ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో ఐరాస సంస్కరణలకూ అది ససేమిరా అంటున్నది.

Spread the love