రాజ ‘దండన’

    నెలరోజులకు పైగా ఆ ఆడబిడ్డల ఆవేదనను కనీసం పట్టించుకోకపోగా, వారి ఆందోళనలను అణచివేస్తూ.. అది చాలదన్నట్టు నిందితుడికి మద్దతుగా ర్యాలీలు తీస్తారట. అవును…రేపిస్టు,, నేరస్తుడు బ్రిజ్‌భూషణ్‌కు మద్దతుగా జూన్‌5న మంత్‌లు, పరివార్‌ బలగాలు ఊరేగింపు చేస్తాయట. ఎంత దిగుజారుడుతనం…! ఎంతటి బరితెగింపు…!! రెజ్లర్లపై లైంగికదాడులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని ఉద్యమిస్తే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడానికి పోలీసులకు ఏడు రోజులు పట్టింది. అదే శాంతియుత నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై ఏడు గంటలు కూడా పట్టలేదు.
ఒక శాంతియుత నిరసన సహనం నశిస్తే ఏమవుతుంది? ఒక ఆందోళన మహాఉగ్రరూపం దాల్చితే ఎలా ఉంటుంది? ప్రవాహం కట్టలు తెంచుకుంటే ఉప్పెనలా ఎలా మారుతుంది? కండ్లలో ఇంకుతున్న కన్నీళ్లు ఒక్కసారిగా నిప్పురవ్వలై ఎగిసిపడితే ఏం జరుగుతుంది? ఢిల్లీలో నలభై తొమ్మిది రోజులుగా రెజ్లర్లు చేస్తున్న న్యాయపోరాటమవుతుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన మహిళా మల్లయోధుల ఆందోళన రోజురోజుకూ మహోద్యమంగా మారుతోంది. అన్ని రాజకీయపార్టీలు, సామాజిక, ప్రజాతంత్ర వాదుల మద్దతు కూడగడుతోంది. కానీ ఘనత వహించిన మోడీ ప్రభుత్వం నూతన పార్లమెంట్‌లో ప్రతిష్టించిన రాజదండం (సెంగోల్‌)ను మొదట వీరిపైనే ప్రయోగించింది! ప్రభుత్వం తమగోడు పట్టించుకోకపోవడంతో ఓపిక నశించిన రెజ్లర్లు మహిళల మద్దతుతో పార్లమెంట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇది సహించని కేంద్రం వారి శాంతియుత ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. మహిళలని కూడా చూడకుండా పార్లమెంట్‌ సాక్షిగా వారిని లాఠీలతో కుళ్లబొడిచింది. కాళ్లకు, చేతులకు గాయాలైన వారు వెనక్కి తగ్గలేదు. ఎర్రటి ఎండలో తమ బాధల్ని నినదిస్తుంటే అప్రజాస్వామికంగా వారి గొంతునొక్కింది. టెర్రరిస్టులకంటే అధ్వాన్నంగా వారిని అరెస్టు చేసింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచదేశాలకు చాటిన రెజ్లర్లకు బీజేపీ సర్కార్‌ చేసిన సత్కారమిది!
విశ్వక్రీడా సమరమైన ఒలింపిక్స్‌లో అత్యధిక వ్యక్తిగత పతకాలు తెచ్చి పెట్టింది కుస్తీవీరులే. అలాంటి ఆటలో ప్రతిభ కనబర్చి దేశానికి పేరు తీసుకొచ్చిన ఆడబిడ్డల్ని పోలీసుల చేత ఈడ్చిపడేయడం బాధాకరం. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకునే పాలిక పెద్దలకు పార్లమెంట్‌ బయట రెజ్లర్లు చేస్తున్న న్యాయ పోరాటం కనపడకపోవడం వైచిత్రి! వారు పతకాలు గెలిచినప్పుడు వారితో సెల్ఫీలు దిగి సోషల్‌ మీడియాలో ప్రదర్శనకు పెట్టిన ప్రధాని… ఒక ఎంపీని కాపాడేందుకు వారి ఉద్యమాన్ని అణిచివేస్తున్న తీరు విచారకరం. ప్రభుత్వాలంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలు వెతకడం. కనీసం రెజ్లర్ల బాధేంటో వినే సమయం కూడా లేకపోతే ఎలా? ఇదేనా ‘బేటీబచావో… బేటీ పడావో’ నినాదానికి అర్థం..! నెలరోజులకు పైగా ఆ ఆడబిడ్డల ఆవేదనను కనీసం పట్టించుకోకపోగా, వారి ఆందోళనలను అణచివేస్తూ.. అది చాలదన్నట్టు నిందితుడికి మద్దతుగా ర్యాలీలు తీస్తారట. అవును… రేపిస్టు, నేరస్తుడు బ్రిజ్‌భూషణ్‌కు మద్దతుగా జూన్‌5న మంత్‌లు, పరివార్‌ బలగాలు ఊరేగింపు చేస్తాయట. ఎంత దిగుజారుడు తనం…! ఎంతటి బరితెగింపు…!! రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడిన బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని ఉద్యమిస్తే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడానికి పోలీసులకు ఏడు రోజులు పట్టింది. అదే శాంతియుత నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై ఏడు గంటలు కూడా పట్టలేదు.ఈ దేశంలో ఎవరి పక్షాన పాలన సాగుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. క్రీడాకారులు, వారి సమస్యల పట్ల కేంద్రం ఎంతటి నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందో, ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తుందో యావత్‌ ప్రపంచం గమనిస్తూనే ఉంది. ఒకవైపు పార్లమెంట్‌ బయట బాధితులపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు నిందితుడు బ్రిజ్‌భూషణ్‌ మాత్రం పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవంలో భాగస్వామిని చేయడం దేనికి సంకేతం?
రెజ్లర్ల న్యాయ పోరాటం ఇప్పుట్లో సమసిపోయేలా లేదు. దానికి కారణం బ్రిజ్‌భూషణ్‌ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నించడమే. అందుకే అదిరింపులు, బెదిరింపులు, నిర్బంధాలు, అరెస్టులు దేనికీ వెనుకాడటం లేదు. అలాగని రెజ్లర్లు కూడా వెనక్కితగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడా ఉద్యమం దేశమంతా విస్తరిస్తోంది. శాంతియుతంగా సాగుతున్న పోరాటానికి ప్రజలు, పార్టీల మద్దతు తోడైంది. అంతర్జాతీయ సంఘీభావం సైతం లభిస్తోంది. రెజ్లర్లకు మద్దతుగా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య కూడా తీవ్రంగానే స్పందించింది. పార్లమెంట్‌ ఎదుట రెజ్లర్ల అరెస్టును ఖండించింది. ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపై నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. నలభై ఐదు రోజుల్లోగా రెజ్లింగ్‌ సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకుంటే… అప్పుడు ఆ ఫెడరేషన్‌ను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించింది. ఇది మంచి పరిణామం. రెజ్లర్లకు పోరాటానికి ఒక ఆలంబనలాంటిది. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతూ ప్రజల్ని రక్షిస్తానని, వారికి భద్రత కల్పిస్తామని గద్దెనెక్కిన పాలకులు దాన్ని విస్మరించడమే అసలు సమస్య. దీనికి పరిష్కారం పౌర సమాజమే చూపాలి.

Spread the love