సంఘీభావం తెలపడమే నేరమా?

Is showing solidarity a crime?– పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై ఉక్కుపాదం
– వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
– పశ్చిమాసియా వివాదంపై మారిన ప్రభుత్వ వైఖరి
న్యూఢిల్లీ : హమాస్‌, ఇజ్రాయిల్‌ మధ్య సాగుతున్న భీకర పోరులో గాజాలో ఇప్పటికే ఎనిమిది వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాతిక వేల మంది గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌ను పూర్తిగా హస్తగతం చేసుకునే వరకూ యుద్ధం ఆపబోమని ఇజ్రాయిల్‌ స్పష్టం చేసింది. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణకాండ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గత ప్రభుత్వాల అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఉంది.
ఇప్పటి వరకూ దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లకు మద్దతు తెలిపాయి. పాలస్తీనా ప్రజలకు ఏకైక, చట్టబద్ధమైన ప్రతినిధి పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌ఓ) మాత్రమేనని 1974లో ప్రకటించిన తొలి అరబ్‌-యేతర దేశం భారత దేశమే. అలాగే 1988లో పాలస్తీనాను గుర్తించిన దేశాల్లో మన దేశం కూడా ఉంది. 1950లో ఇజ్రాయిల్‌ ఏర్పాటును గుర్తించిన ముస్లిం యేతర దేశాల్లో భారత్‌ ఒకటి. పాలస్తీనాలో నివసిస్తున్న అరబ్బుల హక్కులకు నెహ్రూ, గాంధీజీ వంటి నేతలు మద్దతుగా నిలిచారు.
అయితే ఇప్పుడు పాలస్తీనా-ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న ఘర్షణల విషయంలో ప్రభుత్వం సమతూకం పాటిస్తోంది. 2014లో గాజాలో పాల్పడిన నేరాలకు ఇజ్రాయిల్‌ను అంతర్జాతీయ నేరాల న్యాయస్థానంలో నిలిపే విషయంలో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు మన దేశం గైర్హాజరు అయింది. జెరుసలేంను ఇజ్రాయిల్‌ రాజధానిగా ఏకపక్షంగా ప్రకటించేందుకు అమెరికా, ఇజ్రాయిల్‌ చేసిన ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 2016లో ప్రతిపాదించిన తీర్మానాన్ని సమర్ధించింది. తాజాగా హమాస్‌ జరిపిన దాడుల తర్వాత ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌కు సంఘీభావం తెలిపారు. ఈ నెల 12న విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ పాలస్తీనా ఏర్పాటు విషయంలో భారత్‌ వైఖరిని పునరుద్ఘాటించింది. గత శుక్రవారం ఐరాస ప్రత్యేక, అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఇజ్రాయిల్‌-హమాస్‌లు తక్షణమే ఘర్షణకు స్వస్తి చెప్పాలని, అందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. అయితే 45 దేశాలతో పాటు భారత్‌ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది.
నిర్బంధాలు…తప్పుడు కేసులు
ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే పోలీసులు, అధికారులు కూడా పాలస్తీనా అనుకూల ఆందోళనలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని సామాజిక మాధ్యమాలలో ఇజ్రాయిల్‌ అనుకూల, పాలస్తీనా వ్యతిరేక ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇలా ప్రచారం నిర్వహిస్తున్న వారిలో హిందూత్వ వాదులే అధికం. దేశంలో నివసిస్తున్న ముస్లింలపై విషం చిమ్ముతున్న ఈ శక్తులు ఇప్పుడు పాలస్తీనా ముస్లింలను మట్టు పెట్టాలని పిలుపు ఇస్తున్నాయి. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ గళం విప్పుతున్న వారి గొంతు నొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే వారిపై ఓ కన్నేసి ఉంచు తున్నారు.
పాలస్తీనాకు సంఘీ భావంగా అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిం చిన నలుగురు విద్యార్థులపై గత నెల 9న వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇజ్రాయిల్‌ దాడులను నిరసిస్తూ రాజధాని న్యూఢిల్లీలో ప్రదర్శన జరిపిన 60 మందిని గత నెల 16న అరెస్ట్‌ చేశారు. గత నెల 13న ఉత్తరప్రదేశ్‌లో, 23న ఢిల్లీలో కూడా నిరసనకారులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పాలస్తీనాకు మద్దతు తెలిపిన పాపానికి ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. గత నెల 27న బెంగళూరు, మైసూర్‌, తుముకూరులో కూడా నిరసనకారులపై కేసులు పెట్టారు.
ప్రజాస్వామ్యవాదుల నిరసన
రెండు గ్రూపుల మధ్య శతృత్వాన్ని ప్రేరేపిస్తున్నారన్న అభియోగంపై ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద ఆందోళనకారులపై కేసులు పెట్టడాన్ని ప్రజాస్వామ్యవాదులు నిరసించారు. అసమ్మతిని, రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు అధికార పక్షం ఇలాంటి కేసులు పెట్టిస్తోందని వారు మండిపడ్డారు. మైనారిటీలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిని, హింసను రెచ్చగొట్టే వారిని అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం వంటి కారణాలతో వేర్వేరు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపిస్తే అది ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద శిక్షార్హం అవుతుంది. అయితే ఇజ్రాయిల్‌-పాలస్తీనాలు కాల్పుల విరమణ పాటించాలంటూ ప్రదర్శన నిర్వహిస్తే ఆ సెక్షన్‌ను ఎలా ప్రయోగిస్తారని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించారు. పైగా శాంతియుత ప్రదర్శనలకు అనుమతి నిరాకరిండమేమిటని నిలదీశారు.

Spread the love