ఆ యాంకర్లు బీజేపీ బాకాలు

–  అందుకే బహిష్కరించిన ఇండియా కూటమి
న్యూఢిల్లీ : దేశంలోని 14 వార్తా ఛానల్స్‌ ప్రసారం చేసే చర్చా గోష్టులకు తన ప్రతినిధులను పంపరాదని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. అదేమిటి ? మీడియా స్వేచ్ఛపై ప్రతిపక్షాలకు నమ్మకం లేదా అని అనుకునేరు. వాస్తవమేమంటే ఆ ఛానల్స్‌లో రాజకీయ చర్చాగోష్టులు నిర్వహించే యాంకర్లు అధికార బీజేపీకి సన్నిహితులు. అంత మాత్రానికే కార్యక్రమాలను బహిష్కరిస్తారా అంటారా? వారు కేవలం బీజేపీ సన్నిహితులు మాత్రమే కాదు. కమలనాథులకు బాకాలుగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ బహిష్కరణ నిర్ణయం. నిస్పాక్షికంగా వ్యవహరించాల్సిన మీడియా సంస్థలు, వాటిలో పనిచేసే సిబ్బంది ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి వ్యక్తులు ప్రతి చర్చా గోష్టిలోనూ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకొంటున్నారు.
ప్రతిపక్షాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఇప్పటికే జాప్యం జరిగింది. మీడియా పక్షపాత వైఖరి కారణంగా ప్రతిపక్షాలు అనేక సందర్భాలలో ఇబ్బందులు పడ్డాయి. ఉదాహరణకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జోడో యాత్ర చేసిన సమయంలో కొన్ని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలే దానికి శతృవుగా వ్యవహరించాయి. ఈ పక్షపాత ధోరణి, ప్రభుత్వ అనుకూల వైఖరి కాకతాళీయం కాదు. జాతీయ స్థాయిలో తనకు విధేయంగా ఉండే మీడియాను సృష్టించేందుకు మోడీ గత పది సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పైగా తనకు వ్యతిరేకంగా గళం విప్పే మీడియా సంస్థలను అణగదొక్కేందుకు అనేక క్రూరమైన చట్టాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన దానికి తలూపేందుకు నిరాకరించిన ఎన్డీటీవీని ఇటీవలే అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. అదానీ, మోడీ మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. టెలివిజన్‌ కార్యక్రమాలను బహిష్కరించడం ద్వారా ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ షోలలో పాల్గొనకుండా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అంతేకాదు మీడియా పక్షపాత వైఖరిని ఎండగట్టడం ద్వారా దానిపై ఒత్తిడి తేగలిగింది. దీనివల్ల ఆయా ఛానల్స్‌ యాజమాన్యాల వైఖరిలో మార్పు వస్తుందని అనుకోవడం అత్యాశే అయినప్పటికీ ఓటర్ల దృష్టిలో వాటిని దోషులుగా నిలపడంలో ప్రతిపక్ష కూటమి సఫలీకృతమైంది. కానీ ఆయా మీడియా సంస్థలు, చర్చా గోష్టులు నిర్వహించే వారు మాత్రం ఏదో మహాపరాథం జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని, మీడియా హక్కులకు విఘాతం కలిగిందని విమర్శించాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఎలాంటి భయం లేకుండా, శిక్షిస్తారన్న ఆందోళన లేకుండా మాట్లాడడం. కానీ ఇప్పుడు దేశంలో అలాంటి స్వేచ్ఛ పూర్తిగా కరువైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే అరెస్ట్‌ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలు. కొందరు పాత్రికేయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఎన్డీటీవీని అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన తర్వాత అందులో పనిచేసిన రవీష్‌ కుమార్‌ రాజీనామా చేశారు. కొందరు యాంకర్లు తమ మెగాఫోన్లను ఉపయోగించి మైనారిటీలు… ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛ అనగలమా?

Spread the love