నూహ్ లో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత

–  సెక్షన్‌ 144 విధింపు
చండీఘర్‌ : హర్యానాలోని నూహ్ లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు నిలిపివేసింది. నూహ్ హింసాకాండతో సంబంధముందన్న ఆరోపణపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. శాంతి భద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఖాన్‌ను అరెస్ట్‌ చేసి, శుక్రవారం నూహ్ జిల్లా కోర్టులో హాజరు పరిచారు. అల్లర్ల కేసును విచారిస్తున్న హర్యానా సిట్‌కు ఖాన్‌ను రెండు రోజుల కస్టడీ నిమిత్తం పంపేందుకు కోర్టు అనుమతించింది. నూహ్ లో హింసాకాండను ప్రేరేపించేలా ప్రజలను తప్పుదారి పట్టించి వారిని రెచ్చగొట్టే విధంగా సామాజిన మాధ్యమాలలో పోస్టులు పెట్టిన వారితో ఖాన్‌ సంప్రదింపులు జరిపారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఖాన్‌ను 331వ అనుమానితుడిగా చేర్చినప్పటికీ ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టయిన ప్రముఖ వ్యక్తి ఆయనే. మహమ్మద్‌ తాఫిక్‌ అనే వ్యక్తితో ఖాన్‌ జూన్‌ 29, 30 తేదీలలో ఫోన్‌లో మాట్లాడారని, బద్కలీ చౌక్‌ జిల్లాలో జరిగిన హింసతో సంబంధమున్న తాఫిక్‌ను ఆ తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేశారని అధికారులు తెలిపారు. తనకు అరెస్ట్‌ నుండి రక్షణ కల్పించాలంటూ అంతకుముందు ఖాన్‌ పంజాబ్‌ హర్యానా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.

Spread the love