ముంచుకొస్తున్న ఆహార ద్రవ్యోల్బణం

Looming food inflation– కలవరపడుతున్న కమలనాథులు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాబోతోంది. మరోవైపు వచ్చే సంవత్సరం ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల రణరంగంలో విజేతగా నిలవాలని తహతహలాడుతున్న బీజేపీని ఆహార ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. 2013లో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయింది. ఫలితంగా 2014 లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. 2013లో ఆహార ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరింది. పేదల బతుకులు అస్తవ్యస్థమయ్యా యి. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై విమర్శలు సంధించాయి. ప్రముఖ ఆర్థికవేత్త అయి ఉండి కూడా ఆహార ధరలను నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యారంటూ నిందించా యి. అప్పటి సార్వత్రిక ఎన్నికలలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు వరకూ కోలుకోలేకపోతోంది. ఆ నాడు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి పట్టిన గతే ఇప్పుడు తనకూ పడుతుందేమోనని మోడీ భయపడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో తన ప్రభుత్వం మన్మోహన్‌ సింగ్‌ కంటే మెరుగైన పనితీరునే కనబరిచిందని చెప్పుకున్నారు. పైగా 2014 తర్వాత కొద్ది కాలం పాటు నూనెలు, ఆహార వస్తువుల ధరలు తగ్గిపోవడంతో ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగింది. దీంతో చాలా మంది మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఇప్పుడు ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరింది. 2013వ సంవత్సరం రెండో అర్థ భాగంలో ఆహార ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి ఎలా చేరిపోయిందో ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. జూలై, ఆగస్ట్‌ నెలలలో అది రెండంకెలకు చేరుకుంది. నిపుణుల హెచ్చరికలు మన దేశం లో గత ఎనిమిది సంవత్సరాలలో ఎన్నడూ లేనంత గా ఈ రుతుపవన సీజన్‌లో ఇప్పటి వరకూ సగటు వర్షపాతంలో 11% లోటు కన్పిస్తోంది. దీంతో రాబోయే రోజులలో ద్రవ్యోల్బణం మరింత పెరగడం అనివార్యమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు, పప్పులు, వంట నూనెల ధరలు సామాన్యుల వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేయబోతున్నాయి.
ఎన్నికల వేళ ఆందోళన
రాబోయే కాలంలో ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుందన్న వార్తలు ప్రధాని మోడీని, బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలలో కీలక మైన శాసనసభ ఎన్నికలకు సమయం సమీపి స్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి, హ్యాట్రిక్‌ కొట్టాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు కమలనాథులకు అగ్నిపరీక్ష వంటివి. కర్నాటక ఎన్నికల సమయంలో ఇంధన ధరలు…ముఖ్యంగా వంటగ్యాస్‌ ధర పేదలకు అందుబాటులో లేకపోవ డంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫలితంగా ఆ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ డీజిల్‌, పెట్రోల్‌ ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయి.
అంచనాలు పెరిగితే అనర్థమే
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ అంచనాలు పెరి గితే పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టడం చాలా కష్టం. ఉక్రెయిన్‌ యుద్ధం గత సంవత్సరం అధిక ద్రవ్యోల్బణ అంచనాలను సృష్టించింది. ఆహార, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం లో అసాధారణ పెరుగుదల కన్పించింది. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇప్పటికీ అవి ద్రవ్యోల్బణంపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాయి. వాటిలో మన దేశం కూడా ఉంది.
ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పరిస్థితి కొంత కుదుటపడిందని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేసి నప్పటికీ 2019-20 నుండి 2022-23 వరకూ నాలుగు సంవత్సరాల పాటు మన జీడీపీలో కేవలం 3.5% వార్షిక పెరుగుదల మాత్రమే కన్పిం చింది. కోవిడ్‌ కారణంగా ఆర్థికంగా చిన్నాభిన్నమైన ప్రజల బతుకులు ఇంకా గాడిన పడలేదు. వాస్తవ పరిస్థితి నుండి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలకు స్వస్తి చెప్పాలని,పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై దృష్టి సారిం చాలని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం ప్రధానికి హితవు పలికారు. దేశ జనాభాలో 20%గా ఉన్న నిరుపేదలు ప్రభుత్వ దోపిడీ విధానాల కార ణంగా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ధరలు మరింతగా పెరుగుతాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రా యపడ్డారు. అయితే పెరిగే ధరలకు అనుగుణంగా తమ ఆదాయాలు మాత్రం పెరగడం లేదని వారు వాపోయారు. ప్రధాని మోడీ మాత్రం జీ-20 సదస్సుతో తన ప్రతిష్ట ఇనుమడించిందంటూ సంబరపడుతున్నారు.
ఈ ఊపులో ‘భారత్‌ వెలిగిపోతోంది’ తరహాలోనే మరో ప్రచారాస్త్రం సంధించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే అమృత్‌కాల్‌ వంటి నినాదాలు ప్రజలను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. వారికి తాము అనుభవిస్తున్న కష్టనష్టాలు బాగా తెలుసు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పాలకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

Spread the love